కాపు ఉద్యమంతో మోత్కుపల్లికి సంబంధం ఏమిటి?

First Published Jun 2, 2018, 7:44 AM IST
Highlights

కాపు ఉద్యమంతో తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఏం సంబంధమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రశ్నించారు.

అమరావతి: కాపు ఉద్యమంతో తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఏం సంబంధమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని మోత్కుపల్లిని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరడంలోని ఆంతర్యమేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆ మేరకు ఆయన  శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేసారు. తనకు రాజకీయాలు అవసరం లేదని, కాపుల సంక్షేమానికి తన జీవితాన్ని ధారబోస్తానని ముద్రగడ ఇంతకాలం చెబుతూ వచ్చారని, ఇప్పుడు దానికి భిన్నంగా ప్యాకేజీలు తీసుకుని మరెవరి రాజకీయ ప్రయోజనాల కోసమో పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు.

మోత్కుపల్లి ఏపీకి వస్తే కాపులకు కలిగే ప్రయోజనం ఏమిటని ఆయన అడిగారు.. కాపులను బీసీల్లో చేరుస్తూ గత డిసెంబరులో బిల్లును ఆమోదించి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ దాన్ని ఆమోదించాలని ముద్రగడ ఈ రోజు వరకూ కేంద్రాన్ని నిలదీయలేదని,బీజేపీ నాయకులను ప్రశ్నించలేదని అన్నారు. 

కాపు రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక వైఖరి, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మరో వైఖరిని ముద్రగడ అవలంబించడాన్ని కాపు సోదరులు గమనిస్తున్నారని ఆయన అన్నారు.

click me!