టీడీపీలో నాదెండ్ల లొల్లి: వైసీపీ కోవర్టంటూ ప్రచారం

By Nagaraju TFirst Published Jan 29, 2019, 8:52 PM IST
Highlights


నాదెండ్ల భాస్కరరావు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కౌంటర్ ఇచ్చారు. చరిత్ర ఏమిటో తెలుసుకుని నాదెండ్ల మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జయహో బీసీ గర్జన సభను చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిందని అందుకే నాదెండ్ల లాంటివారితో చంద్రబాబుపై విమర్శలు చేయిస్తున్నారని సునీత విమర్శించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీలో మాజీసీఎం నాదెండ్ల భాస్కరావు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత కొద్దిరోజులుగా నాదెండ్ల భాస్కరరావు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ పదవీచిత్యుడిని చేసిన సందర్భం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాటిలో సీఎం చంద్రబాబు పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. 
ఇటీవలే ప్రధాని మోదీని తిట్టి చంద్రబాబు సాధించేది ఏముందంటూ ప్రశ్నించారు. మోదీని కలుపుకుని రాష్ట్రంలో  పాలించాలని సూచించారు. కేంద్రాన్ని తిట్టి సాధించేదేమీలేదని, మోదీని పడగొట్టడానికి ముఠా ఎందుకని నిలదీశారు. రాష్ట్రపాలన గాలికొదిలేసి ముఠాలు కట్టే ప్రయత్నాలేంటని విమర్శించారు. 

మార్పు జరగకపోతే ప్రజలు కష్టపడతారని నాదెండ్ల చంద్రబాబుకు పరోక్షంగా కౌంటర్ వేశారు. తాజాగా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన నాదెండ్ల మళ్లీ  కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ,రెడ్డి అంటూ ముఠాలుకడుతున్నారని ఆగ్రహించి ఆనాటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్ తో కొట్టబోయారంటూ మరో బాంబు పేల్చారు.

 ఆ తర్వాత తాను మర్రి చెన్నారెడ్డిని అడిగితే చంద్రబాబు పార్టీలో ముఠాలు కడుతున్నారని అతనని ఎవరూ చేరదీయకండంటూ చెప్పుకొచ్చారని బట్టబయలు చేశారు. అంతేకాదు తిరుపతి రైల్వే స్టేషన్లో చంద్రబాబు దొంగతనం చేసినట్లు కేసు కూడా ఉందని గుర్తు చేశారు నాదెండ్ల భాస్కరరావు.  

రోజురోజుకీ నాదెండ్ల భాస్కరరావు సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చెయ్యడంతో  ఆ పార్టీ అయోమయానికి గురవుతుంది. చంద్రబాబు రాజకీయ వ్యవహారం అంతా తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన్ను ఎలా నిలువరించాలో తెలియక మదనపడుతోంది.  

నాదెండ్ల భాస్కరరావు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కౌంటర్ ఇచ్చారు. చరిత్ర ఏమిటో తెలుసుకుని నాదెండ్ల మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జయహో బీసీ గర్జన సభను చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిందని అందుకే నాదెండ్ల లాంటివారితో చంద్రబాబుపై విమర్శలు చేయిస్తున్నారని సునీత విమర్శించారు.
 
ఆనాడు కుట్ర రాజకీయాల్లో భాగంగా ఎన్టీఆర్ లేని సమయంలో ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి దొడ్డిదారిన సీఎం అయ్యారని సునీత ఘాటుగా విమర్శించారు. అలాంటి వ్యక్తి అన్నవరం సత్యదేవుని వద్దకు వచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పోతుల సునీత స్పష్టం చేశారు.

click me!