టీడీపీ రాగానే హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు : తేల్చిచెప్పిన నారా లోకేష్

By Siva KodatiFirst Published Sep 21, 2022, 6:12 PM IST
Highlights

టీడీపీ అధికారంలోకి రాగానే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తిరిగి పెడతామన్నారు ఆ పార్టీ నేత నారా లోకేష్. రాజశేఖర్ రెడ్డి, జగన్ యూనివర్సిటీకీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మొదటి హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తుచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పెరు పెట్టారని లోకేశ్ తెలిపారు. జగన్ సీఎం అయ్యాక అన్నింటికీ పేర్లు మారుస్తున్నారని.. యూనివర్సిటీ నుంచి ప్రభుత్వం ఖర్చులు కోసం రూ.400 కోట్లు తీసుకుందని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇంత రహస్యంగా ఎందుకు చేసారో ప్రజలు ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో ప్రభుత్వం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

రాజశేఖర్ రెడ్డి, జగన్ యూనివర్సిటీకీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గతంలో ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో ఉండేవని లోకేష్ గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి పేర్లు మారిస్తే ఏమవుతుందని ఆయన నిలదీశారు. శాసనమండలిలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. 9 బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా ఏకపక్షంగా పూర్తి చేశారని.. టీడీపీ అధికారంలోకి రాగానే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టి తీరుతామని లోకేష్ స్పష్టం చేశారు. 

ALso Read:ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం..?: చంద్రబాబు

కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ప్రవేశ పెట్టారు.  వైద్యరంగంలో సంస్కరణలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టినందునే ఆయన పేరును ఈ హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని తాము భావించినట్టుగా మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వమే గొప్పగా గౌరవించిందన్నారు. ఎన్టీఆర్ ను కించపర్చేలా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మంత్రి రజనీ ఈ సందర్భంగా చెప్పారు. 

అనంతరం ఈ విషయమై సీఎం జగన్ కూడా ప్రసంగించారు. ఎన్టీఆర్ ను కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. వైద్య రంగంలో సేవలు చేసినందుకే వైఎస్ఆర్ పేరును మెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ సెటైర్లు వేశారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. 

ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందే టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్టీఆర్ కు  వెన్నుపోటు పొడవకపోతే ఆయన ఆ టర్మ్  కూడా పూర్తి కాలం పాటు పదవిలో ఉండేవారేమోనని జగన్ అన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబు నాయుడు ఏనాటికి కూడా సీఎం కాకపోయి ఉండేవారేమోననే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు.  ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. 
 

click me!