ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం, ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు

By Siva KodatiFirst Published Sep 21, 2022, 5:40 PM IST
Highlights

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ మండిపడ్డారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీకి ఆయన సిఫారసు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారు. మార్షల్స్ వారి డ్యూటీ వారు చేస్తారని..  వారిపై మ్యాన్ హ్యండిలింగ్ చేయడాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇకపై ఇలాంటి చర్యలు ఎప్పడు ఎవ్వరికి జరగకూడదని ప్రివిలేజ్ కమిటీ కఠిన నిర్ణయం తీసుకోవాలని తమ్మినేని కోరారు. ప్రివిలేజ్ కమిటీ వెంటనే సమావేశమై రికార్డ్స్ చూసి వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. ప్రతిపక్షం ఎంత రెచ్చగోట్టినా అధికారపక్ష సభ్యులు సంయమనంతో వ్యవహరించారని తమ్మినేని సీతారాం ప్రశంసించారు. 

ALso Read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన: వరుసగా ఐదో రోజూ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

పోడియంను సభ్యులు చుట్టుముట్టి అల్లరి చేస్తున్నవారి విషయంలో సభ సీరియస్ గా ఆలోచించాలన్నారు. లేకపోతే ఇదో ప్యాషన్ గా తయారయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలి... ఈ రోజు సభలో ఆందోళన చేసివారు ఎవ్వరో రికార్డుల్లో ఉందని తమ్మినేని పేర్కొన్నారు. ఈ సెషన్స్‌లో ఎంతో సహనంతో ఉన్నా వచ్చి పేపర్లు చించడంతో పాటు దుర్భాషలాడారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను లేచి నిలబడాల్సిన పరిస్ధితి వచ్చిందని.. ఇలాంటి వారు శాసనసభకు వస్తే చాలా బాధగా ఉందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఎక్కడో దగ్గర అరికట్టాలని కాబట్టి సభ సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. సభ గౌరవాన్ని మనం పెంచాలని.. దీనిపై ఆలోచించాలని సభను ఆయన వేడుకున్నారు. 

click me!