
వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు గాను ఏపీ ప్రభుత్వం ఏక సభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. గురువారం బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఉద్యమ కార్యాచరణ, సాధికార కమిటీల ఏర్పాటు, బలోపేతంపై చర్చించినట్లు చెప్పారు.
ALso REad:ఎస్టీ జాబితాలోకి వాల్మీకి, బోయ కులాలు.. అధ్యయనానికి కమిటీ , జగన్ సర్కార్ ఆదేశం
40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో బీసీలకు ఎంతో చేసిందని... ఈ విధంగా మరో పార్టీ చేయలేదని లోకేశ్ గుర్తుచేశారు. అయితే ఎన్నికలకు ముందు బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ వారిని మోసం చేశారని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు టీడీపీ కల్పిస్తే.. వాటిని 24 శాతానికి తగ్గించింది ఎవరని లోకేశ్ ప్రశ్నించారు. వాల్మీకి, బోయ కులాలను ఎస్టీల్లోకి చేర్చేందుకు టీడీపీ హయాంలోనే బీజాలు పడ్డాయని.. అప్పట్లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు ఆయన గుర్తుచేశారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి తీర్మానం చేస్తామన్న జగన్ దానిని పట్టించుకోలేదని.. మూడున్నరేళ్ల తర్వాత కమీషన్ అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. బీసీల కోసం తెలుగుదేశం పార్టీ అండగా వుండి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.