కుప్పంను పులివెందులలా కాదు.. ముందు పులివెందులను డెవలప్ చేయండి : జగన్‌పై బీటెక్ రవి సెటైర్లు

By Siva KodatiFirst Published Aug 10, 2022, 5:04 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి. కుప్పంను చంద్రబాబు అన్ని విధాల అభివృద్ది చేశారని బీటెక్ రవి తెలిపారు. జగన్ పులివెందుల బస్టాండ్‌ని అభివృద్ది చేస్తే చాలని ఆయన దుయ్యబట్టారు
 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (ys jagan) విమర్శలు గుప్పించారు టీడీపీ నేత (tdp) , ఎమ్మెల్సీ బీటెక్ రవి (btech ravi) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందే అభివృద్ది చెందిన కుప్పంను పులివెందులలా అభివృద్ది చేస్తామని జగన్ అనటం హాస్యాస్పదంగా వుందన్నారు. కుప్పంను చంద్రబాబు అన్ని విధాల అభివృద్ది చేశారని బీటెక్ రవి తెలిపారు. జగన్ పులివెందుల బస్టాండ్‌ని అభివృద్ది చేస్తే చాలని ఆయన దుయ్యబట్టారు. 600 కోట్లు ఖర్చు చేసి  పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదని రవి ప్రశంసించారు. 

జగన్ పులివెందుల రైతులకు డ్రిప్ మెటీరియల్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరూ సీఎంలుగా ఉండి పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతులు తీసుకురాలేదని బీటెక్ రవి చురకలు వేశారు. గాలి జనార్ధన్ రెడ్డికి మైనింగ్ లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం  సిద్దపడటం దారుణమన్నారు. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్న జగన్ నేడు ఆయనకు మైనింగ్ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

Also Read:గాలి జనార్థన్ రెడ్డికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఏపీ పరిధిలో మళ్లీ తవ్వకాలకు అభ్యంతరం లేదన్నప్రభుత్వం...

ఇకపోతే.. వివాదాస్పద మైనింగ్ వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని గనుల్లో మళ్లీ తవ్వకాలు ప్రారంభించేందుకు మార్గం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.  తవ్వకాలు ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఆయనకు చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించింది. కర్ణాటకతో సరిహద్దు అంశంపై స్పష్టత వచ్చినందున.. తమ భూభాగంలో తవ్వకాలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని  ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఓఎంసీ విజ్ఞప్తిని పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఆ కంపెనీపై దాఖలైన మరో కేసును విచారిస్తున్న ధర్మాసనానికి ఈ కేసును కూడా నివేదించాలని సూచించింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది. గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. వీటిపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. 2009లో ఆ కంపెనీతవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై ఓఎంసీ అప్పటి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చింది. దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఒకపక్క ఓఎంసి కేసు విచారణ పెండింగ్లో ఉండగానే.. తన భూభాగం పరిధిలో తవ్వకాలకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం గమనార్హం.

click me!