రాయలసీమ ఎత్తిపోతలతో వెలిగొండకు నీరు రాదు: ఏపీ సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల మరో లేఖ

By narsimha lodeFirst Published Jul 16, 2021, 4:29 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన  గెజిట్ నోటిఫికేషన్ లో వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని పేర్కోనడంపై  టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై పునరాలోచన చేయాలని ఆయన కోరారు.


ఒంగోలు: వెలిగొండను అనుమతి లేని ప్రాజెక్టుగా గెజిట్‌లో పేర్కొనడంపై ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు.వెలిగొండకు అనుమతి లేదని గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొనడంతో  ఆ ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంలో పడిందని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, వీరాంజనేయస్వామి, ఏలూరు సాంబశివరావు  ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు  సీఎం జగన్ కు లేఖ రాశారు.దీని వల్ల ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు విభజన చట్టంలో ఉందని ఎమ్మెల్యేలు ఆ లేఖలో గుర్తు చేశారు.  25 ఏళ్ల క్రితం ప్రారంభమై తుది దశలో ఉన్న ప్రాజెక్టుకు అనుమతులు లేవనడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టును అనుమతి లేని జాబితాలో చేర్చడం ద్వారా లక్షల మంది ప్రజలు ఇబ్బందులపాలయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రకాశం జిల్లాలోని నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతం ఎడారిగా మారిపోయే అవకాశం ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండ పూర్తి చేయడంలో ప్రభుత్వం మాట మారుస్తోందని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.రాయలసీమ ఎత్తిపోతలతో వెలిగొండకు నీరు వచ్చే అవకాశం ఉండదని  ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలపై పునరాలోచన చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను కోరారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.


 

click me!