వూళ్లో లేకపోతే ఓట్లు తీసేస్తారా.. మరి జగన్ 30 ఏళ్లుగా పులివెందులో లేరు, ఆయనకు ఓటా : పయ్యావుల కేశవ్

By Siva KodatiFirst Published Aug 24, 2023, 5:05 PM IST
Highlights

ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడిన బూత్ లెవల్ అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారని ఆయన వెల్లడించారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను దొంగ ఓట్ల వ్యవహారం కుదిపేస్తోంది. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వూళ్లో లేరన్న కారణంతో ఓట్లు తొలగించడం సరికాదన్నారు. అలా అయితే జగన్ గడిచిన 30 ఏళ్లుగా పులివెందులలో లేరని.. అయినా ముఖ్యమంత్రికి అక్కడ ఓటు ఎలా వుంది అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

ఓట్లు తొలగించాల్సి వస్తే.. కమిటీని వేసి, ఫిర్యాదుదారుడి ఎదుటే తనిఖీ చేయాలని ఆయన సూచించారు. అంతే తప్పించి మూకుమ్మడిగా ఓట్లు తొలగించే అధికారం ఎవరికీ లేదన్న ఈసీ ఆదేశాలను పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. గతంలో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడిన బూత్ లెవల్ అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారని ఆయన వెల్లడించారు. తన ఫిర్యాదుతో రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని కేశవ్ గుర్తుచేశారు. 

ALso Read: ఓటర్ల జాబితాలో అవకతవకలు.. పయ్యావుల కేశవ్ ఫిర్యాదు, అనంత జెడ్పీ సీఈవోపై వేటు

కాగా..  ఆంధ్రప్రదేశ్‌లో భోగస్ ఓట్ల వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశారు. తాజా ఏపీ అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కూడా నకిలీ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు వేసింది. జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. 

నియోజకవర్గంలో 6 వేల దొంగ ఓట్లను చేర్చడంతో పాటు పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు చర్యలు చేపట్టారంటూ భాస్కర్ రెడ్డిపై కేశవ్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు ఉరవకొండలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఓట్ల తొలగింపు, చేర్పులలో భాస్కర్ రెడ్డి ప్రమేయం వున్నట్లుగా తేలింది. దీంతో భాస్కర్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఏపీ సీఎస్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలపై చీఫ్ సెక్రటరీ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఈసీ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. 

click me!