
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసే అందుకు ఉదాహరణ అని అన్నారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని.. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసి, అధికారంలోకి రాగానే అక్కర్లేదన్నారని నిమ్మల దుయ్యబట్టారు. అవినాష్ రెడ్డిని రక్షించాలనే ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని రామానాయుడు ఆరోపించారు.
చివరికి వివేకా వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా ఆరోపణలు చేస్తున్నారని.. నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో రూ.92 వేల కోట్లకు పైగా మద్యం విక్రయాలు అధికారికంగా జరిగితే.. అనధికారికంగా రూ.1.22 లక్షల కోట్లు జరిగాయని నిమ్మల అన్నారు. ఈ క్రమంలో రూ.11 వేల కోట్ల కమీషన్లను జగన్ అందుకున్నారని రామానాయుడు ఆరోపించారు. కలెక్టరేట్లు, భూములను తాకట్టు పెట్టారని.. ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో పేదలకు జరిగిన లాభం కంటే , వైసీపీ నేతలకే ఎక్కువ జరిగిందన్నారు.
ALso Read: రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుంది.. ఆ వీడియోలను చూసినట్టు లేదు: మంత్రి రోజా
అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరినప్పుడు చంద్రబాబుకు రజనీకాంత్ మద్దతుగా నిలిచారని ఆరోపించారు. అటువంటి రజనీకాంత్ ఈరోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడటం శోచనీయమని అన్నారు. వెధవలంతా చేరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ బతికున్నప్పుడు రజనీకాంత్ ఏం చేశారని ప్రశ్నించారు. రజనీకాంత్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవుతూ మరింత దిగజారిపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే రజనీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దింపారని ఆరోపించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను పవన్ కల్యాణ్ గ్రహించాలని అన్నారు.