
అమరావతి: కులాల మధ్య మంటలు రాజేసి ఆ మంటల్లో చలికాచుకునే నీచమైన పార్టీ వైసీపీ అని టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు మండిపడ్డారు. విధాన పరంగా ఎదుర్కోవడం చేతకాక క్షత్రియుల మధ్య జగన్ రెడ్డి వివాదాలకు ఆజ్యం పోస్తున్నాడని రామరాజు ఆరోపించారు.
''ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఒక కులాన్ని తిట్టినట్లా శ్రీరంగనాథరాజు? మీ పార్టీకి ఉన్న కులగజ్జిని అందరికీ ఆపాదిస్తే ఎలా.? విమర్శించిన వారిని కులాల వారీగా విడదీసి చూడటం సిగ్గుచేటు. కనీసం మీరు ఒకసారైనా క్షత్రియ కులానికి ఒక్క పదవి కావాలాని జగన్ రెడ్డిని అడిగారా.? క్షత్రియుల అభివృద్ధికి ఏం కృషి చేశారు?'' అని మంత్రి రంగనాథరాజును నిలదీశారు రామరాజు.
''జగన్ రెడ్డి కులానికి ఇచ్చిన 822 నామినేటెడ్ పదవుల్లో ఒక్క పదవినైనా ఇతర కులానికి కట్టబెట్టారా? 15 నెలలుగా ఒక ఎంపీని నియోజకర్గానికి రానివ్వకుండా చేస్తున్నారంటే క్షత్రియుల మీద ప్రభుత్వం ఎంత పగబట్టిందో అర్థమవుతోంది. కులాల కుంపట్ల గురించి వైసీపీ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుంది'' అని మండిపడ్డారు.
read more చూస్తూ ఊరుకోం... అధికారంలోకి రాగానే గుణపాఠం తప్పదు: అచ్చెన్న వార్నింగ్
''బీసీలు సఖ్యతగా ఉన్నారని వారిలో ఎడబాట్లు తెచ్చేందుకు కులానికి ఒక కార్పొరేషన్ పెట్టారు. కాసుల్లేని కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి బీసీలను అవమానించారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కులాలను లేవనెత్తడం సిగ్గుచేటు. పార్టీలకు అతీతంగా అన్ని కులాల వారు అన్ని పార్టీల్లో ఉంటారు. రాష్ట్రంలో ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం వైసీపీకి అలవాటుగా మారిపోయింది'' అన్నారు.
''ప్రజల సమస్యలను వినేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుండి జగన్మోహన్ రెడ్డి బయటకు రావడం లేదు. నిధులు, పెద్ద హోదాలు ఉన్న పదవులను సొంత సామాజిక వర్గానికి తప్ప మరో సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వడం లేదు.? ట్రస్టుల్లో అక్రమాలు జరిగితే నిరూపించాలి. ట్రస్టు భూములు దోచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో భూదానాలు చేసి దేశంలోనే గొప్ప రాజవంశంలో పుట్టిన అశోక్ గజపతిరాజును వెల్లంపల్లి శ్రీనివాస్ వెధవ అని సంబోధించినప్పుడు మీరు ఎక్కడ వున్నారు.? నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు'' అని రామరాజు హెచ్చరించారు.