రాజీనామా ఆమోదం కోసం కోర్టు మెట్లెక్కనున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు

By Pratap Reddy KasulaFirst Published Mar 27, 2022, 8:00 AM IST
Highlights

తన రాజీనామా లేఖను ఆమోదింపజేయాలని కోరుతూ విశాఖ ఉత్తర టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు తన రాజీనామా ఆమోదం కోసం కోర్టు తలుపు తట్టనున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  తన రాజీనామా ఆమోదం కోసం కోర్టును ఆశ్రయించాలని గంటా శ్రీనివాస రావు నిర్ణయించుకున్నారు. 

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారం కార్మిక సంఘాల పోరాటానికి మద్దతు తెలుపుతూ ఆయన నిరుడు ఫిబ్రవరి 6వ తేదీన రాజీనామా చేశారు. అయితే, రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్ లో లేదనే విషయం ముందుకు వచ్చింది. దాంతో ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి స్పీకర్ ఫార్మాట్ లో ఫిబ్రవరి 12వ తేదీన రాజీనామా లేఖ సమర్పించారు. 

ఏడాది దాటినా కూడా గంటా శ్రీనివాస రావు రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. దీంతో తన రాజీనామాను ఆమోదింపజేయాలని కోరుతూ గంట శ్రీనివాస రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదిలావుంటే, గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు గతంలో విరివిగా ప్రచారం జరిగింది. టీడీపీ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. గంటా శ్రీనివాస రావు వైఎస్సార్ కాంగ్రెసులో చేరుతారని కూడా ప్రచారం సాగింది. అయితే, అది కూడా జరగలేదు. 

click me!