
రాజధాని అమరావతిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సీఆర్‌డీఏ (crda) ఇచ్చిన నోటీసులపై అమరావతి రైతులు అభ్యంతరం తెలిపారు. భూసేకరణ కింద తీసుకున్న భూముల్లో ప్లాట్లు కేటాయించిన అధికారులు.. ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్ (registration) చేయించుకోవాలని ఇటీవల రైతులకు నోటీసులు జారీ చేశారు. గతంలో భూ సమీకరణతో పాటు 2వేల ఎకరాలు భూ సేకరణ చట్టం కింద తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి భూమి యజమానులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. భూసేకరణ పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తి కాకుండా, ప్లాట్లు అభివృద్ధి చేయకుండా రిజిస్ట్రేషన్ ఏంటని రైతులు (amaravathi farmers) అనుమానాలు వ్యక్తం చేశారు. తమ సందేహాలు నివృత్తి చేసిన తర్వాతే ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని స్పష్టం చేస్తూ సీఆర్‌డీఏ అధికారులకు రైతులు వినతిపత్రాలు సమర్పించారు.
అంతకుముందు కోర్టు చెప్పినట్టుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామనే ఇప్పటికీ అంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) తెలిపారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన మాకు వున్న అధికారాలతోనే రాజధానులపై చట్టాలు (ap three capitals) చేశామన్నారు . రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడే వున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు (chandrababu naidu) అధికారం పోయిందన్న కడుపు మంటతో మాట్లాడుతున్నారంటూ బొత్స ఫైరయ్యారు. శాసనసభ సమావేశాలను జరగకుండా చేయడానికి టీడీపీ సభ్యులు ఆటంకాలు కలిగిస్తున్నారని.. కాగితాలు విసురుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న సహజ మరణాలను .. కల్తీసారా మరణాల కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని బొత్స ఫైరయ్యారు. జంగారెడ్డి గూడెం వాసులకు వాస్తవాలు తెలుసునని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు జరగలేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మేం ఏ వ్యవస్థపై దాడి చేశామని నిలదీశారు. 7,300 ఎకరాలు అమ్మితే లక్ష కోట్లు వస్తాయా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అంబేద్కర్ నిర్ణయించిన రాజ్యాంగ ప్రకారం చట్టాలు ఉండాలని తాము మొదటి నుంచి చెప్తున్నామని ఆయన అన్నారు. దాన్ని అధిగమించి ఎవరూ ఏమీ చేయరని, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే నడుస్తున్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఎవరి పాత్ర ఎంతవరకు అనే దానిపై సభలో చర్చించామని బొత్స చెప్పారు. అభిప్రాయ బేధం ఉంటే చంద్రబాబు శాసనసభలో మాట్లాడవచ్చని సూచించారు. అందుకు భిన్నంగా బయట కూర్చుని ఎలా మాట్లాడతారు అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ బద్దమైనవిగానే ఉంటాయని స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల నిర్ణయం కోరుదామనుకుంటే.. తాము వద్దన్నామా? అని బొత్స ప్రశ్నించారు. ప్రజల కోసం చేసే చట్టాల్లోకి ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఆయన వ్యాఖ్యానించారు.