అమరావతి ఆందోళనపై ఢిల్లీ రైతుల ఆరా: గద్దె రామ్మోహన్

By Siva KodatiFirst Published Dec 14, 2020, 2:48 PM IST
Highlights

అమరావతి రైతులు చేసిన త్యాగం అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భూములు ఇచ్చి...‌బజారున పడిన వైనం ఆందోళన కలిగిస్తుందని ఎద్దేవా చేశారు

అమరావతి రైతులు చేసిన త్యాగం అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భూములు ఇచ్చి...‌బజారున పడిన వైనం ఆందోళన కలిగిస్తుందని ఎద్దేవా చేశారు.

34వేల ఎకరాలను రాష్ట్రం కోసం రైతులు ఇచ్చారని గద్దె గుర్తుచేశారు. వారి ఆవేదనను కనీసం అర్దం చేసుకునే దుస్థితి లో సిఎం ఉన్నారని రామ్మోహన్ ద్వజమెత్తారు. ఎండ, వాన, కరోనా లెక్క చేయకుండా ఉద్యమం చేస్తున్నారని.. 17వ తేదీకి అమరావతి పోరాటానికి ఏడాది అవుతుందని ఆయన చెప్పారు.

అరెస్టు లు, లాఠీఛార్జి లు భరిస్తూ రైతులు, మహిళలు పోరాడుతున్న వైనం దేశానికే ఆదర్శమని రామ్మోహన్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రజందరూ అమరావతి నే రాజధాని గా కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

వారి ఆందోళనలకు మద్దతుగా ఈనెల‌ 15వ తేదీన విజయవాడ లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారని గద్దె తెలిపారు. రాజకీయ, ప్రజా సంఘాలతో పాటు, ప్రజలు కూడా తరలి వచ్చి రైతులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు సైతం అమరావతి ఉద్యమం పై ఆరా తీస్తున్నారని రామ్మోహన్ చెప్పారు. సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించక పొతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళతామని ఆయన హెచ్చరించారు.

కేంద్రం తమకు సంబంధం లేదని చెప్పడం కరెక్ట్ కాదని.. మోడీ ప్రధాని హోదాలో శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి అన్నారు. భారత దేశ మ్యాప్ లో కూడా రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించారని రామ్మోహన్ వెల్లడించారు.

కేంద్రం కూడా ఈ విషయంలో లో స్పందించి రాజధానిగా అమరావతి ని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు స్పందించకుంటే.. అన్ని రాష్ట్రాల రైతులను కలుపుకుని .. జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు.

అన్నం పెట్టే అన్నదాతల కన్నీరు దేశానికి మంచిది కాదని.. రాష్ట్రం లో రాక్షస ప్రభుత్వం నడుస్తుంది ‌... ప్రజల గోడు పట్టడం లేదని రామ్మోహన్ ఎద్దేవా చేశారు.

చివరికి వైసిపి ఎమ్మెల్యే లు కూడా జగన్ తీరు పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. ప్రజా పోరాటం ద్వారా అమరావతిని అందరం కలిసి కాపాడుకుందామని గద్దె పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో పంజాబ్ రైతుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు లో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. 

click me!