Omicron:జనవరిలో థర్డ్ వేవ్ హెచ్చరిక... అయినా ఏపీలో ఇదీ పరిస్థితి: టిడిపి ఎమ్మెల్యే ఆందోళన

Arun Kumar P   | Asianet News
Published : Dec 19, 2021, 01:58 PM IST
Omicron:జనవరిలో థర్డ్ వేవ్ హెచ్చరిక... అయినా ఏపీలో ఇదీ పరిస్థితి: టిడిపి ఎమ్మెల్యే ఆందోళన

సారాంశం

ఒమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్నా, ఇప్పటికే ఏపీలో ఓ కేసు నమోదయి ప్రజలు ఆందోళన చెందుతున్నా తనకేమీ పట్టదన్నట్లు ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు.     

అమరావతి: కరోనా థర్డ్ వేవ్ (corona third wave), ఒమిక్రాన్ (omicron) ముప్పు ముంచుకొస్తున్నా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy) నిర్లక్ష్యాన్ని వీడటంలేదని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (eluru sambashivarao) ఆరోపించారు. థర్డ్ వేవ్ రానీ, ఒమిక్రాన్ కేసులు పెరగనీ... ఎవరెలా చస్తే నాకేంటి అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైనా ముఖ్యమంత్రిలో చలనం లేకపోవడం బాధ్యతారాహిత్యం కాదా? అని నిలదీసారు. ఇప్పటికే సీఎం జగన్ అసమర్థత, చేతకానితనం వల్లే రాష్ట్రంలో కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ (corona second wave) లలో భారీ ప్రాణ నష్టం జరిగిందని ఎమ్యెల్యే ఏలూరి ఆరోపించారు. 

''వైసీపీ (ysrcp) ప్రభుత్వ వైఫల్యం కారణంగా దేశంలోనే రోజువారీ కరోనా కేసుల నమోదులో 5వ స్థానంలో, వ్యాక్సినేషన్ లో 10వ స్థానంలో ఏపీ నిలిచింది. కరోనా పరీక్షలు, టీకా పంపిణీలో రికార్డులు సృష్టించామని ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోంది. చాలా చోట్ల రెండో డోసు వేయకుండానే వేసినట్టు మెసేజ్ లు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? రోజువారీ ప్రభుత్వ బులిటెన్లలో వ్యాక్సిన్ వివరాలు ఎందుకు పొందుపరడం లేదు?'' అని ప్రశ్నించారు.

''జనవరి 2022లో ఒమిక్రాన్ తీవ్రం కావచ్చని... వైద్య వ్యవస్థపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయినా ఏపీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడంలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేక రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న దుస్థితికి ఈ ప్రభుత్వం కారణం కాదా?'' అని మండిపడ్డారు. 

read more  Covid EX-gratia కోసం కొత్త Portal ప్రారంభించిన‌ ఏపీ స‌ర్కార్

''యువతను నాశనం చేసే గంజాయి అమ్మకాలు ఎలా పెంచాలి, జనాన్ని మద్యం మత్తులో ఎలా ముంచాలి, పన్నుల పోటుతో మధ్య తరగతి రక్తం ఎలా పీల్చాలి అనే అంశాలపై ప్రతిరోజూ సమీక్షా సమావేశాలు నిర్వహించే ముఖ్యమంత్రికి ఒమిక్రాన్ తీవ్రతపై సమీక్షించే తీరక లేదా? అవినీతి సొమ్ముతో గల్లా పెట్టె నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై ఎందుకు లేదు?'' అని నిలదీసారు. 

''విదేశీయలు నుంచి ఒమిక్రాన్ రాకుండా పొరుగు రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యల్లో పరుగులు పెడుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడంపైనే దృష్టి పెడుతోంది.  ప్రతిరోజూ మన రాష్ట్రానికి 2500మందికి పైగా విదేశీయులు వస్తుండగా వారికి ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించే వ్యవస్థే మన దగ్గర లేదంటే వైద్యఆరోగ్యశాఖ ఎంత వైఫల్యం చెందిందో అర్ధం చేసుకోవచ్చు'' అని ఎద్దేవా చేసారు.

''విమానాశ్రయాల్లో కేవలం ఒక్కో మెడికల్ టీమ్ నే ఏర్పాటుచేసి చేతులు దులిపేసుకున్నారు.  విదేశీ ప్రయాణికుల టెస్టు రిపోర్ట్ తేల్చే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో జాప్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన నిర్లక్ష్యం వీడి ఒమిక్రాన్ కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజలు తిరగబడి తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించడం ఖాయం'' అని హెచ్చరించారు. 

read more  ఏపీ: 24 గంటల్లో 137 మందికి కరోనా.. గోదావరి జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

''మరోవైపు కొవిడ్ మృతుల కుటుంబాలకు అందించే రూ. 50,000 పరిహారానికి వైసీపీ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది.  బాధితులు ఇచ్చే దరఖాస్తులకు మునుపెన్నడూ లేని ఆంక్షలు పెట్టడంతో మొత్తం పరిహార ప్రక్రియే ప్రహసనంగా మార్చేశారు. కిందిస్థాయిలో డెత్ సర్టిఫికెట్ కావాలంటే రూ. 10 వేలు డిమాండ్ చేస్తున్న ఘటనలూ వెలుగు చూస్తున్నా వైద్యశాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదు'' అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు తీవ్ర ఆరోపణలు చేసారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్