ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తేనే రైతులపై కేసులా?: టిడిపి ఎమ్మెల్యే సీరియస్

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 12:20 PM IST
Highlights

సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులను అడగకుండా మరెవరిని అడగాలి? అని టిడిపి ఎమ్మెల్యే సాంబశివరావు ప్రశ్నించారు. 

అమరావతి: జగన్ రెడ్డి స్వార్థ నిర్ణయంతో 5 కోట్ల మంది ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించకుండా వేధిస్తున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన రైతులను అరెస్టు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులను అడగకుండా మరెవరిని అడగాలి? అని సాంబశివరావు ప్రశ్నించారు. 

''తక్షణమే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. 565 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులను పట్టించుకోకపోవడం దారుణం. రైతుల డిమాండ్ ను నెరవేరుస్తూ అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలి'' అని సాంబశివరావు కోరారు.  

''రూ.250 కోట్లతో చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించి 80 శాతం పూర్తి చేశారు. వాటికి సుమారు రూ.170 కోట్ల రూపాయలు కూడా చెల్లించారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా కమీషన్ల కోసం కరకట్ట  పనులు ప్రారంభించారు. వైసీపీ నేతలు అక్రమంగా తోడుకుంటున్న గ్రావెల్, ఇసుక రవాణాకు మార్గం సుగమం చేసేందుకు కరకట్ట పనులు ప్రారంభించారు'' అని ఆరోపించారు. 

read more  నా బిడ్డల జోలికొస్తే వైసీపీకి మూడినట్లే: అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

''రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూముల్లో 1689 ఎకరాలను బిల్డ్ ఏపీ కింద అమ్మేందుకు కుట్ర చేస్తున్నారు. దీనికి ఏడాది క్రితమే బీజం పడింది. ప్రజల ఆస్తులను అమ్ముకుంటూ చేసేది పరిపాలన అంటారా?'' అని మండిపడ్డారు. 

''మీ తీరు చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. స్వేచ్ఛాయుత వ్యాపారాలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు.  రాజధానిలో నిర్మించిన నిర్మాణాలు శిథిలావస్తకు చేర్చుతున్నారు. కోటానుకోట్ల ప్రజాధనం వృధా చేయడం మంచిదికాదు. మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల్లో భూకబ్జాలు తప్ప మూడు తట్టల మట్టికూడా వేయలేదు. తక్షణమే ప్రభుత్వ తీరు మార్చుకుని అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలి'' అని సాంబశివరావు డిమాండ్ చేశారు. 

click me!