అచ్చెన్నకు కరోనా నెగెటివ్...నేడో, రేపో డిశ్చార్జీ

By Arun Kumar PFirst Published Aug 31, 2020, 11:04 AM IST
Highlights

మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెనాయుడు కరోనా బారినుండి సురక్షితంగా బయటపడ్డారు. 

 గుంటూరు: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెనాయుడు కరోనా బారినుండి సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవలే ఆయన కరోనా బారినపడగా ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సోమవారం ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ గా తేలింది. దీంతో  ఆయన కుటుంబసభ్యులు, టిడిపి  శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇవాళగానీ రేపుగానీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. 

అచ్చెన్నాయుడు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన కరోనా తో బాధపడుతుండటంతో ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అచ్చెన్నకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. 

read more  ఏపీలో కోరలు చాస్తున్న కరోనా: కేసుల్లో దేశంలోనే రెండవ స్థానం

ఇకపోతే ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి  శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లిపోవద్దని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

70 రోజుల పాటు అచ్చెన్నాయుడు రిమాండ్ లో ఉన్నారు. నామినేషన్ పద్దతిలోనే మందుల కొనుగోలుకు అచ్చెన్నాయుడు లేఖ ఇచ్చారని... దీని ద్వారా రూ. 150 కోట్ల మేరకు అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు.

ఈ ఏడాది జూన్ 12 వ తేదీన ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరోగ్య కారణాలతో గుంటూరు జైల్లో ఉన్న అచ్చెన్నాయుడిని పోలీసులు రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడికి కరోనా సోకడంతో కోర్టు అనుమతితో ఆయనను ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.  

click me!