కరోనా కష్టకాలంలో ప్రజల నుండి అధిక విద్యుత్ చార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం టిడిపి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
అమరావతి: కరోనా కష్టకాలంలోనూ విద్యుత్ ఛార్జీలు మూడు, నాలుగు రెట్లు పెంచి ప్రజలపై మరింత భారం మోపుతున్న ప్రభుత్వ చర్యలకు నిరసనగా గురువారం టిడిపి నేతలు ఇళ్లలోనే నిరసన దీక్షలు చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కరోనా కష్టాలతో ప్రజలు తల్లడిల్లుతుంటే ఆదుకునే చర్యలు చేపట్టకుండా వైసిపి ప్రభుత్వం మరిన్ని కష్టాల్లోకి నెట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గురువారం రాష్ర్ట వ్యాప్తంగా అన్ని మండలాలు, నియోజకవర్గాలలో టిడిపి నాయకులు ఇళ్లలోనే ఉంటూ నిరసన దీక్షలు చేయాలని ఆయన సూచించారు.
‘‘కరోనా పేదల జీవితాల్లో కల్లోలాన్ని సృష్టించింది. ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోకుండా వైసిపి ప్రభుత్వం మరింత అల్లకల్లోలం చేస్తోంది. కరెంటు ఛార్జీలు పెంచడం ద్వారా పెనం మీద ఉన్న ప్రజలను పొయ్యిలోకి నెడుతోంది. లాక్ డౌన్ తో 2నెలలుగా పేదలకు ఉపాధి లేదు. రోజువారీ ఆదాయాన్ని ప్రజలు కోల్పోయారు. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజానీకం ఉంటే దొడ్డిదారిన కరెంటు బిల్లులు పెంచడం హేయం'' అని చంద్రబాబు మండిపడ్డారు.
undefined
''కరోనా కష్టాల్లో అల్లాడుతుంటే కరెంటు ఛార్జీలు పెంచడం కిరాతకం. ఉపాధి పోయిన పేదల ఊపిరి తీస్తున్నారు. ఇది కరెంటు ఛార్జీలు పెంచే సమయమా..? పేదలను ఆదుకునే క్లిష్ట కాలమా..? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై ఎవరైనా భారాలు మోపుతారా..? దేశంలోని డిస్కమ్ లకు కేంద్రం రూ90వేల కోట్ల రాయితీలు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సగం జీతాలు తీసుకునే ఉద్యోగులకు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు, పంటలకు ధరలేక నష్టపోయిన రైతులకు విద్యుత్ ధరలు పెంచడం దుర్మార్గం'' అని విమర్శించారు.
read more వారితో సీఎం కనీసం మాట్లాడకపోవడం...గుట్టు బయటపడుతుందనేనా?: చంద్రబాబు ఆగ్రహం
''టిడిపి ప్రభుత్వం 5ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని కూడా ప్రకటించాం. ఎన్నికల ముందు ఓట్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచమని జగన్ హామీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ అడిగి తీసుకుని, తీరా పదవి చేపట్టాక మాట తప్పి ఛార్జీలు పెంచడం దారుణ మోసం. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలి'' అని డిమాండ్ చేశారు.
'' ఫిబ్రవరి బిల్లుకు సమానమైన బిల్లులనే లాక్ డౌన్ 3నెలల్లో కూడా కట్టించుకోవాలి. శ్లాబులను మార్చే చర్యలకు స్వస్తి చెప్పాలి. నిరసన దీక్షల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై టిడిపి నాయకులు ఒత్తిడి తేవాలి. అటు కరోనాతో, ఇటు వైసిపి దుర్మార్గ చర్యలతో కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా ఉండాలి'' అని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.