విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో ప్రతిపక్ష టిడిపిలో అంతర్గత విబేధాలు సోషల్ మీడియాకు ఎక్కాయి. ఈ టికెట్ ఆశిస్తున్న బోండా ఉమ, వంగవీటి రాధ వర్గాల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది.
విజయవాడ: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలో సీట్ల లొల్లి మొదలయ్యింది... ఈసారి ఆశించిన టికెట్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఇలా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి లలో ఆశావహులు ఎక్కువగా వుండటంతో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారింది. ఇదే సమయంలో ఒకేసీటును ఆశిస్తున్న నాయకుల మధ్య కోల్డ్ వార్ పార్టీ పెద్దలకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇలా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టిడిపి సీటు విషయంలో వంగవీటి రాధ, బోండా ఉమ మధ్య రగడ మొదలయ్యింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి బోండా ఉమ టిడిపి తరపున పోటీ చేసారు. ఇదే సమయంలో వైసిపి అధినాయకత్వంతో విబేధించి టిడిపిలో చేరారు వంగవీటి రాధ. బోండా ఉమను గెలిపించుకునేందుకు తన వంతు ప్రయత్నం కూడా చేసారు రాధ. కానీ ఈ ఎన్నికల్లో వైసిపి హవా గట్టిగా వీయడంతో బోండా ఉమ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లోనూ విజయవాడ సెంట్రల్లో టిడిపికి వ్యతిరేక ఫలితమే వచ్చింది. ఇది బోండా ఉమ రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపించాయి.
అయితే గత ఎన్నికల్లో వైసిపి తరపున విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించిన వంగవీటి రాధ ఈసారి టిడిపి తరపున ఆశిస్తున్నారు. టిడిపి అదిష్టానం కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా రాధ తన సీటుకే ఎసరు పెట్టాడని గ్రహించిన బోండా ఉమ అలర్ట్ అయ్యారు. రాధను వైసిపికి సన్నిహితుడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని తాజాగా రాధ వర్గం తిప్పికొట్టింది. ఇలా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విషయంలో రాధ, ఉమ మధ్య వార్ సాగుతోంది.
Also Read షర్మిల గారు... డేట్, టైమ్ మీరు చెప్పినా సరే..: వైసిపి ఎమ్మెల్యే సవాల్
ఇటీవల బోండా ఉమ వర్గం టిడిపి అధినాయకత్వం వంగవీటి రాధను నమ్మడంలేదంటూ ఉమ వర్గీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. గత ఐదేళ్లలో రాధ టిడిపికి మద్దతుగా మాట్లాడింది లేదు సరికదా వైసిపి నాయకులతో స్నేహంగా వుంటూ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్లుగా వ్యవహరించారని బోండా వర్గం ఆరోపిస్తోంది. చంద్రబాబు ఇళ్లు, టిడిపి కార్యాలయంపై దాడి జరిగినా పట్టించుకోలేదని అంటున్నారు. టిడిపిలో చేరాడనే కానీ ఇప్పటివరకు రాధ పార్టీ కండువానే కప్పుకోలేదంటూ ఉమ వర్గీయులు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు.
ఇలా ఉహ వర్గం పోస్టులకు అదే సోషల్ మీడియా వేదికన కౌంటర్ ఇస్తోంది రాధ వర్గం. టిడిపి నాయకత్వం నమ్మాలంటే నీలా చేయమంటావా? అంటూ ఉమపై సెటైర్లు వేస్తున్నారు. పదవి కోసం పార్టిని బెదిరించాలా..? చిన్న పిల్లల చావుకి కారణం అవ్వాలా..? దేవుడి పేరుతో చందాలు పోగెయ్యాలా? కార్పోరేటర్ టికెట్లు అమ్ముకోవాలా..? పదవి రాకపోతే కాపుల గొంతుకోసారని పార్టీకి ,కులానికి మద్య విరోధం పెంచాలా..? ఈసారి టికెట్ రాదని అధికార పార్టితో చర్చలు జరపాలా? ఇలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా అంటూ ఉమను నిలదీస్తూ రాధ వర్గం పోస్టులు పెడుతోంది.
వంగవీటి రాధ, బోండా ఉమ వర్గపోరుతో విజయవాడ సెంట్రల్ లీడర్లు, క్యాడర్ డైలమాలో పడ్డారు. ఇప్పటికే స్థానిక ఎంపీ కేశినేని నాని టిడిపిని వీడి వైసిపిలో చేరడంతో పార్టీ నష్టనివారణ చర్యలు చేపడుతుండగా నాయకుల టికెట్ లొల్లి మొదలయ్యింది. దీంతో ఇద్దరు నేతలు సంయమనంతో వ్యవహరించాలని... తమ వర్గీయులను కంట్రోల్ చేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.