
తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన శిల్పాచక్రపాణిరెడ్డి ప్రభావం పచ్చతమ్ముళ్లపై బాగానే పడినట్లుంది. ఎందుకంటే, చక్రపాణి టిడిపికి రాజీనామా చేయటమే కాకుండా ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేసేసారు. పైగా చక్రపాణి మూడు నెలల క్రితమే ఎంఎల్సీగా ఎన్నికవ్వటం గమనార్హం. ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని జగన్ చేసిన సూచన మేరకు చక్రపాణి చట్టసభలకు కూడా రాజీనామా చేసేసి మగాడినని నిరూపించుకున్నారు. దాని ప్రభావమే టిడిపిలోకి ఫిరాయించిన 20 మంది వైసీపీ ఎంఎల్ఏలపై బాగా ఒత్తిడి పెంచుతున్నట్లే కనబడుతోంది.
పార్టీ ఫిరాయింపులపై టీడీపీ నాయకులు కొత్త రాగం అందుకున్నారు. ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తే రాజీనామా చేయాల్సిన అవసరం తమకులేదని బుకాయింపులకు దిగారు. వైసీపీ ఎవరి రాజీనామాలు అడుగుతోంది? టిడిపిలో గెలిచిన ఎంఎల్ఏల రాజీనామాలను వైసీపీ కోరటం లేదే. వైసీపీ తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన వారి రాజీనామాలను మాత్రమే కోరుతున్నదన్న ఇంగితం కూడా తమ్ముళ్ళకు లేకపోయింది.
పైగా ఫిరాయింపుల అంశం పార్లమెంట్, సుప్రీంకోర్టు పరిధిలో ఉందంటూ విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా అంశం వైఎస్సార్ సీపీ పార్టీకి సంబంధించిన నిర్ణయమని, ఆయన రాజీనామాతో తమకు ఎటువంటి సంబంధం లేదని నిశిగ్గుగా చెబుతున్నారు. గెలుస్ధామన్న ధైర్యముంటే కుంటిసాకులు, ఎదురుదాడులు ఎందుకు చేస్తారు తమ్ముళ్ళు. పార్టీ మారినప్పుడు ఏం చేయాలనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. మొన్నటి వరకూ ఎంఎల్ఏల రాజీనామాల విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పింది వీళ్ళే.
చక్రపాణిరెడ్డిని జగన్ తమ పార్టీలో చేర్చుకునేటప్పుడే ఎంఎల్సీకి కూడా రాజీనామా చేయించటంతో ఫిరాయింపు మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. అసలే నంద్యాల ఉపఎన్నికల సెగ బాగా తగులుతోంది. దానికితోడు చక్రపాణిరెడ్డి రాజీనామా వ్యవహారం నియోజకవర్గంలో బాగా చర్చ జరుగుతున్నట్లుంది. అందులోనూ ఫిరాయింపు మంత్రులు, ఎంఎల్ఏలను కూడా రాజీనామా విషయంలో జనాలు నిలదీస్తున్నారు. దీంతో అధికార టీడీపీ నాయకుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టు తయారై నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.