వల్లభనేని వంశీ తన రాజకీయ భవిష్యత్తును అగమ్యగోచరం చేసుకుంటున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు
వల్లభనేని వంశీ తన రాజకీయ భవిష్యత్తును అగమ్యగోచరం చేసుకుంటున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. ఈ క్రమంలో వివిధ సందర్భాల్లో వైఎస్ జగన్‌పై వల్లభనేని వంశీ చేసిన చేసిన వ్యాఖ్యల దృశ్యాలను మీడియాకు తెలిపారు. అన్నం తినేవాడేవ్వడూ వైసీపీలో చేరడు అని చెప్పిన వంశీ.. చివరికి అదే పార్టీలోకి వెళ్తున్నారని వర్ల ధ్వజమెత్తారు.
అవినీతిపరుడు, అవగాహన లేదు, వార్డు మెంబర్‌గా కూడా పనికి రాడని జగన్‌ను వంశీ తిట్టారని రామయ్య గుర్తుచేశారు. వంశీ వ్యవహారశైలి సరిగా లేదని.. పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పట్ల మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు. అయ్యప్పమాల వేసుకున్న వంశీ.. తోటి వ్యక్తిపట్ల అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని వర్లరామయ్య ఆరోపించారు.
ప్రలోభాలకు లోంగిపోయో, కేసులకు భయపడో వల్లభనేని వైసీపీలోకి వెళుతున్నారని వర్ల విమర్శించారు. ఆనాడు ఎవరు రికమెండ్ చేస్తే వంశీకి టికెట్ ఇచ్చారో రాష్ట్రం మొత్తానికి తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున వంశీ ఎంతో లబ్ధి పొందారని... ఆయనపై ఉన్న ఓ కేసు పనికిమాలినదన్నారు.
Also Read:జూ.ఎన్టీఆర్‌తో పోలికా, ఉన్న పళ్లు ఊడిపోతాయి: బాబుపై వంశీ ఘాటు వ్యాఖ్యలు
కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. అధినేత ఆదేశాల మేరకు వంశీని శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. దాసరి బాలవర్థన్ గారిని కాదని వల్లభనేని వంశీకి పార్టీ టికెట్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నది అవాస్తవమన్నారు.
కృష్ణాజిల్లాలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని నిధులను టీడీపీ హయాంలో వంశీ పొందారని అర్జునుడు గుర్తుచేశారు. కృష్ణాజిల్లా పార్టీ తనకు సహకరించలేదన్న వంశీ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు.
వంశీ క్యారెక్టర్‌ను దెబ్బతీసే విధంగా మార్ఫింగ్ వీడియోలు ఎవరు చేసినా తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తామన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. వంశీ చెప్పిన వెబ్‌సైట్లకు టీడీపీ తరపున నుంచి ఎటువంటి చెల్లింపులు వెళ్లడం లేదని... వాటికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు.
Also Read:జూ.ఎన్టీఆర్ ది ముగిసిన కథ, వంశీ నీకు సిగ్గుందా: నారా లోకేష్ ధ్వజం
జగన్మోహన్ రెడ్డితో ఎవరికైనా సంబంధం ఉందంటే అది కేవలం జైల్ కనెక్టివిటి మాత్రమేనని ఆమె ఆరోపించారు. నారా లోకేశ్‌తో వల్లభనేని వంశీ ఎంతో సన్నిహితంగా ఉండేవారని అనురాధ గుర్తుచేశారు. లోకేశ్ వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి రూ.80 కోట్లు ఖర్చు చేసిన ఘనత దేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీదేనన్నారు.
జగన్ ప్రశాంత్ కిశోర్‌ను నమ్ముకుని ముందుకు వెళ్లారు కానీ... కార్యకర్తల మంచి చెడు కనుక్కొన్న దాఖలాలు లేవన్నారు. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా నారా లోకేశ్ గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డారని అనురాధ గుర్తుచేశారు. వాలంటీర్లు వస్తున్నారంటే జనం తలుపులు వేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులను బెదిరించి జగన్ సంతకాలు పెట్టించారని అనురాధ మండిపడ్డారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టనని జగన్ శాసనసభ సాక్షిగా ప్రకటించారని... మరి ఇప్పుడు వంశీ చేరికపై ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానం చెబుతారని మరో నేత ప్రశ్నించారు. ఆనాడు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారని అందువల్ల వచ్చిన లాభమేమి లేదని ఆయన గుర్తుచేశారు.