అప్పుల ఊబిలోకి ఆంధ్రప్రదేశ్, కాగ్ సమక్షంలో లెక్కలు తేల్చుకుందాం.. జగన్‌కు యనమల సవాల్

By Siva KodatiFirst Published Dec 25, 2022, 6:04 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. రాష్ట్ర అప్పులపై కాగ్ సమక్షంలో చర్చకు తాను సిద్ధమన్నారు. దేశంలోనే అత్యధిక అప్పులతో జగన్ చరిత్రలో నిలిచిపోతారని రామకృష్ణుడు చురకలంటించారు.

ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్, మంత్రులపై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణాలకు సంబంధించి సీఎం, మంత్రులు రోజుకొకలాగా మాట్లాడుతున్నారని చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్ అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్‌తో తాను చర్చకు సిద్ధమని యనమల సవాల్ విసిరారు. 25 ఏళ్ల నుంచి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై తనకు అవగాహన వుందని ఆయన పేర్కొన్నారు. కాగ్‌కు కూడా వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతున్నారని యనమల ఆరోపించారు. గత ప్రభుత్వం కంటే తాము తక్కువ అప్పులు చేస్తున్నామని జగన్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 

దేశంలోనే అత్యధిక అప్పులతో జగన్ చరిత్రలో నిలిచిపోతారని రామకృష్ణుడు చురకలంటించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1,63,981 కోట్లు అప్పులు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం కేవలం మూడేళ్లలోనే రూ. 6లక్షలకు కోట్లకు పైగా రుణాలు చేసిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వ్యవహారాల్లో లంచాలు, అవినీతి తగ్గిందని జగన్ చెప్పడం పెద్ద జోక్ అన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అవినీతి, అక్రమాలకు పాల్పడొద్దని మంత్రులకు క్లాస్ పీకలేదా అని యనమల ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 

ALso REad: అప్పుల ఊబిలో దూసుకుపోతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్.. ఒక్కొక్క‌రిపై ఎంత అప్పువుందంటే..?

ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ నానాటికీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కేంద్రప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో అప్పుల భారం ఏడాదికేడాది భారీగా పెరుగుతూనే ఉన్నాయి. 2018లో రూ.2,29,333.8 కోట్ల అప్పులు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,98,903.6 కోట్లకు పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2017-18లో రుణ శాతం 9.8 శాతం తగ్గిందనీ, ఇప్పుడు అది 17.1 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు జీఎస్‌డీపీలో 42.3 శాతం ఉన్న అప్పుల భారం 2015లో 23.3 శాతానికి తగ్గింది.

2021 నాటికి ఇది జీఎస్డీపీలో 36.5 శాతానికి చేరుకుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ అప్పులను పెంచుతోందనీ, ఇది ఆరోగ్యకరమైన ధోరణి కాదని ఆయన అన్నారు. మొత్తం జీఎస్‌డీపీలో  25 శాతం కంటే తక్కువ రుణాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిలో ఉన్నాయని మంత్రి పంక‌జ్ చౌద‌రి చెప్పారు.

మార్చి 2020 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.3,07,672 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రజల తలసరి అప్పు రూ.62,059గా ఉందన్నారు. ఏపీ అప్పు-జీఎస్‌డీపీ నిష్పత్తి 31.7 శాతానికి చేరుకుందని వివరించారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ రాజ్యసభలో ప్రశ్న అడిగారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా తలసరి రుణాన్ని లెక్కించినట్లు మంత్రి తెలిపారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల సంఖ్య మాత్రమే. కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు, కార్పొరేషన్‌ రుణాలు, ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలు తదితరాలు కలిపితే వాటి సంఖ్య కనీసం మూడు రెట్లు పెరుగుతుంది. 

click me!