ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వయోపరిమితి పెంపునకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

By Mahesh RajamoniFirst Published Dec 25, 2022, 5:48 PM IST
Highlights

Amaravati: ఏపీ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఎస్‌ఐ ఉద్యోగాలకు జనరల్ కేటగిరీలో 21 నుంచి 29 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 21 నుంచి 34 ఏళ్ల వరకు వయోపరిమితి పెరిగింది.
 

AP Police Department: ఏపీ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వయోపరిమితి పెంపునకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్థుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగ‌నుంది. వివ‌రాల్లోకెళ్తే.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జనరల్ కేటగిరీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 నుంచి 26 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 18 నుంచి 31 ఏళ్ల వయోపరిమితి పెంపు నిర్ణ‌యం తీసుకున్నారు. 

అదేవిధంగా ఎస్‌ఐ ఉద్యోగాలకు జనరల్ కేటగిరీలో 21 నుంచి 29 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 21 నుంచి 34 ఏళ్ల వరకు వయోపరిమితి పెరిగింది. పోలీస్ శాఖ 6,100 కానిస్టేబుల్, 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి అక్టోబర్ 20న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్ర‌మంలోనే వ‌యోప‌రిమితి పెంచాలంటూ అభ్య‌ర్థుల నుంచి విన‌తులు రావ‌డంతో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీలు సైతం ఈ విష‌యం వ్యాఖ్యానించాయి. దీంతో ప్ర‌భుత్వం పోలీసు రిక్రూట్ మెంట్ పోస్టుల‌కు వ‌యోప‌రిమితి పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ పోస్టుల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం 6,511 పోలీసు పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. వాటిలో ఎస్‌ఐ పోస్టులు 411, కానిస్టేబుల్‌ పోస్టులు 6,100 ఉన్నాయి. ఈ మేరకు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

click me!