ఆరో స్థానం నుండి రెండో స్థానానికి ఏపీ...ఈ ఘనత జగన్ సర్కారుదే: మాజీ మంత్రి యనమల ఎద్దేవా

Arun Kumar P   | Asianet News
Published : Sep 12, 2021, 12:49 PM IST
ఆరో స్థానం నుండి రెండో స్థానానికి ఏపీ...ఈ ఘనత జగన్ సర్కారుదే: మాజీ మంత్రి యనమల ఎద్దేవా

సారాంశం

వైసిపి ప్రభుత్వంలో తీవ్ర ఆర్థిక అవకతవకలు జరుగుతున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి యనమల ఆరోపించారు. దాదాపు రెండు లక్షల కోట్లకు సంబంధించిన లెక్కలే లేవని ఆయన అన్నారు. 

గుంటూరు: జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా అప్పులు చేస్తోందన్న వార్తలే తప్ప ఆదాయం సమకూర్చుకునే మార్గాలు సృష్టించిందన్న ఒక్క వార్త కూడా కనిపించడం లేదని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. పైగా తీసుకొచ్చిన అప్పులు కూడా ఏమవుతున్నాయో, ఏం చేస్తున్నారో లెక్కా పత్రం లేకుండా పోతోందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. 

''రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో దాదాపు రూ.2,68,835 కోట్ల అప్పు చేయగా అందులో రూ.1.05లక్షల కోట్లను ప్రజలకు పంచినట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో తీసుకొచ్చిన మొత్తం అప్పులో కేవలం 25.50% మాత్రమే అంటే కేవలం రూ.68,632 కోట్లు మాత్రమే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ప్రజలకు పంచారు. మిగిలిన రూ.1.99 లక్షల కోట్లు (74.50%) ఏం చేశారు? ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుండి సమాధానం లేదు'' అని అన్నారు.

''గత రెండున్నరేళ్లలో కేపిటల్ ఎక్స్ పెండించర్ కోసం ఖర్చు చేసింది రూ.31వేల కోట్లు మాత్రమే. లెక్కల్లో చూపని రూ.1.99 లక్షల కోట్లలో రూ.31వేల కోట్లు తీసేసినా ఇంకా రూ.1.68 లక్షల కోట్లకు సంబంధించిన లెక్కలెక్కడ.? ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేసినట్లు.? ఎవరి జేబుల్లోకి మళ్లించినట్లు?'' అని మాజీ ఆర్థిక మంత్రి నిలదీశారు.  

''ఒకవేళ ఆ నిధులను రెవెన్యూ కోసం ఖర్చు చేసినా అది ఆర్ధిక నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. గత రెండేళ్ల బడ్జెట్ లెక్కల ప్రకారం సంక్షేమం కోసం రూ.68,632 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఖర్చును పరిశీలిస్తే సంక్షేమం కోసం చేసిన ఖర్చులో దేశంలో 19వ స్థానంలో ఉన్నాం. దీంతో ఆర్ధిక మంత్రి చెప్పిన రూ.1.05 లక్షల కోట్ల ఖర్చు కూడా అబద్దమేనని అర్ధమవుతోంది'' అన్నారు. 

read more  టీచర్లతో మద్యం, నిరుద్యోగులతో మాంసం... కొత్తపథకానికి జగన్ రెడ్డి శ్రీకారం: బుద్దా వెంకన్న ఎద్దేవా

''తెలుగుదేశం ప్రభుత్వం 2018-19లో రూ.18 వేల కోట్ల ఖర్చుతో అమలు చేసిన దాదాపు 17 పథకాలనే జగన్ రెడ్డి పేరు మార్చి అమలు చేస్తూ కొత్త పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. అందుకోసం 2019-20లో 18 పథకాల కోసం రూ.24,072 కోట్లు, 2020-21లో 19  పథకాల కోసం రూ.27,043 కోట్లు, మరో 3 పథకాలకు రూ.16,899 కోట్లు ఖర్చు చూపారు. మొత్తంగా చూసుకున్నా 22 పథకాలకు రెండు సంవత్సరాల్లో ఖర్చు చేసింది రూ.68,632 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సగటున చేసిన ఖర్చు రూ.34,316 కోట్లు మాత్రమే. 2018-19తో పోల్చుకుంటే 2019-20లో 18 పథకాల కోసం రూ.6,043 కోట్లు మాత్రమే అధనంగా ఖర్చు చేశారు. 2020-21లో 22 పథకాల కోసం అధనంగా ఖర్చు చేసింది రూ.25,942. మాత్రమే అధనంగా ఖర్చు చేశారు. సంక్షేమం కోసం ఎంతో ఖర్చు చేశామంటున్న ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెబుతుంది.?'' అని యనమల నిలదీశారు. 

''సమాజ వికాసానికి, శాశ్వత అభివృద్ధికి, కుటుంబ ఆదాయాన్ని పెంచేందుకు దోహద పడేలా తెలుగుదేశం ప్రభుత్వం 17 సంక్షేమ పథకాలను అమలుచేస్తే వైసీపీ ప్రభుత్వం 22 పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో పేరు మార్చి అమలు చేస్తున్న 17 పథకాలను తీసేస్తే వైసీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది 5 పథకాలు మాత్రమే'' అని అన్నారు. 

''ఇక మరోవైపు వైసిపి ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం రెండున్నరేళ్లలో చేసిన వ్యయం కేవలం రూ.1,34,562 కోట్లు మాత్రమే. గతంతో పోలిస్తే 21.8శాతం తక్కువ. సంక్షేమం, సామాజిక భద్రత(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ) కోసం చేసిన ఖర్చు రూ.50,788 కోట్లు మాత్రమే. ఇది కూడా గత ఖర్చులతో పోలిస్తే 18శాతం తక్కువ. సంక్షేమం కోసం నిధుల ఖర్చులో దేశంలోనే 18వ స్థానంలో నిలిచాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది.? ఎంతో ఎక్కువ చేశామన్నపుడు.. ఎందుకు అంతలా వెనుకబడ్డాం.?'' అని ప్రశ్నించారు.

''సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018-19లో 3వ స్థానంలో ఉండగా ఇప్పటికీ అదే స్థానంలో ఉన్నాం. గతంలో మన కన్నా వెనుక ఉన్న రాష్ట్రాలు ప్రస్తుతం 1, 2 స్థానాలకు చేరాయి. 2018-19లో పేదరికంలో రాష్ట్రం 6వ స్థానంలో ఉంటే ప్రస్తుతం 2వ స్థానానికి చేరడంతో పేదరికం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్ధిక అసమానతలు 32 శాతం నుండి 43శాతానికి పెరిగిపోయాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా పేదరికంలోకి దిగజారారు. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత.? సంక్షేమం లేదు, అభివృద్ధీ లేదు. మరి ఎడాపెడా చేస్తున్న అప్పులు, ఆస్తులు తాకట్టు పెట్టి కూడగట్టిన సొమ్ము, ఆస్తులు అమ్మేసి కూడగట్టిన సొమ్ములు ఏమవుతున్నట్లు.? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్లు.?'' అని అడిగారు. 

''జగన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలన మొత్తం పన్నుల భారం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రజలపై పన్నులేసి వారి జీవన ప్రమాణాలను దిగజార్చారు. వినిమయ శక్తి క్షీణించింది. పొదుపు శక్తి పతనమైంది. గత రెండున్నరేళ్లలో ఏనాడైనా పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతికూల సంకేతాలు తప్ప.. సానుకూల సంకేతాలు కనిపించిన దాఖలాలే లేవు. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, ఆదాయం పెంపుకోసం ఒక్క ఆలోచన కూడా చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. దూరదృష్టి, దార్శనికత లేమితో రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువగల కుటుంబాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలే కారణం'' అని ఏపీ మాజీ ఆర్థిక మంత్రి యనమల ఆరోపించారు.  

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu