టీచర్లతో మద్యం, నిరుద్యోగులతో మాంసం... కొత్తపథకానికి జగన్ రెడ్డి శ్రీకారం: బుద్దా వెంకన్న ఎద్దేవా

By Arun Kumar PFirst Published Sep 12, 2021, 12:07 PM IST
Highlights

ఇప్పటికే ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన సీఎం జగన్ ఇప్పుడు డిగ్రీలు చదివిన నిరుద్యోగులతో మాంసం అమ్మించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడని టిడిపి నాయకులు బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. 

 విజయవాడ: ఇప్పటికే ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతతో మాంసం, రొయ్యలు, చేపలు అమ్మించే కొత్తపథకానికి శ్రీకారం చుట్టాడని టీడీపీ  ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించలేని అసమర్థ ప్రభుత్వం మాంసం విక్రయాల కోసం వారిని నియమించడం సిగ్గుచేటని బుద్దా మండిపడ్డారు.

''విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులతో మద్యం అమ్మించినప్పుడే జగన్ ఆలోచలను, విధానాలేమిటో అర్థమైపోయాయి.  ఇసుక పాలసీ పేరుతో దాదాపు 40లక్షల మంది నిర్మాణరంగ కార్మికుల పొట్టకొట్టిన జగన్... ఆ తర్వాత మద్యం అమ్మకాలను గంపగుత్తగా తనపార్టీ వారిపరం చేసి మరికొందరికి కూడులేకుండా చేశాడు. తాజాగా మాంసం వ్యాపారం పేరుతో మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు, రొయ్యలు అమ్ముకొని జీవనం సాగించేవారికి ఉపాధిలేకుండా చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ విధంగా జీవించేవారంతా బలహీనవర్గాల వారేనని, వారందరి పొట్టకొట్టడం ద్వారా జగన్ వారిపై తనకున్న అక్కసుని తీర్చకుంటున్నాడన్నారు'' అని వెంకన్న ఆరోపించారు.

''జగన్ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం ఆరునెలలు తాగితే జనం చనిపోతున్నారు. అలానే మాంసం అమ్మకాలతో ఇంకెందరిని బలితీసుకుంటుందో చూడాలి. మాంసం విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలను రోడ్డునపడేసి, తనపార్టీ వారికి ఆయా విక్రయాలను అప్పగించాలన్నదే జగన్ లక్ష్యం. తద్వారా తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడంలో భాగమైన జేట్యాక్స్ వసూళ్లకోసమే ఈ చర్యకు సిద్ధమయ్యాడు'' అన్నారు.

''సీఎం జగన్ రెడ్డికి ప్రభుత్వమే మాంసం అమ్మాలనే ఆలోచన ఎలా వచ్చిందో, ఎవరిచ్చారో ఆయనే చెప్పాలి. మార్కెట్లో చేపలు, రొయ్యలు అధికంగా అమ్మేది మత్స్యకారులైతే, మటన్ ముస్లింలు ఎక్కువగా అమ్ముతుంటారని... వారందరికి తిండిలేకుండా చేయడానికే జగన్ ఇటువంటి పథకాలకు శ్రీకారం చుడుతున్నాడు. జగన్ కు ఇలాంటి చచ్చు సలహాలు ఇచ్చేది ఖచ్చితంగా విజయసాయి రెడ్డే. తన తాడేపల్లి, ఇడుపులపాయ ప్యాలెస్ లను డబ్బుతో నింపుకోవడానికి, బడుగు బలహీనవర్గాలవారికి ఉపాధిలేకుండా చేయడానికే ముఖ్యమంత్రి ఇటువంటి తుగ్లక్ చర్యలకు పాల్పడుతున్నాడు'' అని మండిపడ్డారు.

read more  'సీఎం' అంటే... 'చేపలు' 'మాంసం' అమ్మడం కాదు, ఇందుకే తుగ్లక్ అనేది: జగన్‌పై అయ్యన్న వ్యాఖ్యలు

''జగన్ అనుచరులు, ప్రభుత్వం మాంసం, చేపలు, రొయ్యలు అమ్మడం మొదలుపెడితే వారు చెప్పినధరకే వాటిని చచ్చినట్టు కొనాలి. ఆ విధంగా ప్రజలసొమ్ముని దౌర్జన్యంగా తమజేబుల్లో వేసుకోవడానికే జగన్ ఇటువంటి పిచ్చిపనులు ప్రారంభిస్తున్నాడు. ప్రభుత్వం అంటే పచారీ కొట్టుకాదని స్వర్గీయ నందమూరి తారకరామారావు ఎప్పుడో చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం పక్కా పచారీ వ్యాపారమే చేస్తోంది. రూ.800 ల మటన్ రూ.1500లకు అమ్మడం, కేజీ రూ.200లు అమ్మే చేపలను రూ.500లకుఅమ్మి మాంసం ప్రియులను దోపిడీచేయడమే జగన్మోహన్ రెడ్డి మటన్ మార్ట్ ల అంతిమలక్ష్యం'' అని ఆరోపించారు.

''ఇసుక అమ్మకాలతో జగన్ రెడ్డి ఇప్పటికే 40లక్షల మందిని రోడ్డున పడేశాడు. మద్యం అమ్మకాలతో మరో 10లక్షల మందికి ఉపాధి లేకుండా చేశాడు. తాజాగా మాంసం విక్రయాల పేరుతో మరికొన్ని లక్షల మందికి తిండిలేకుండా చేయడానికి సిద్ధమయ్యాడు. జగన్ రెడ్డి తీసుకున్న మాంసం విక్రయాల నిర్ణయాన్నితాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. బడుగు, బలహీనవర్గాల పొట్టేకొట్టే చర్యలకు ముఖ్యమంత్రి స్వస్తి పలికేవరకు వారితోకలిసి ప్రభుత్వంపై పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నాము'' అని వెంకన్న తెలిపారు.

''ఇప్పటికే వివిధరూపాల్లో జగన్ సహజవనరులను యధేచ్ఛగా దోచుకుంటున్నాడు. అది చాలదన్నట్లు మరలా మద్యం అమ్మకాలతో భారీగా ప్రజల రక్తాన్ని డబ్బురూపంలో పిండుతున్నారు. అవి చాలవన్నట్లు ఇప్పుడు మాంసం అమ్మకాలంటున్నారు. కల్తీ మద్యం అమ్మకాలతో అంతిమంగా జగన్ జనాభా నియంత్రణకు శ్రీకారం చుట్టాడనే సందేహం కలుగుతోంది. చదువుకున్న యువతకు వారి చదువు, అర్హతలకు సరిపడే ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, వారితో మందు, మాంసం అమ్మించడం సిగ్గుచేటు. డిగ్రీలు, పీజీ పట్టాలు పొందినవారితో మాంసం అమ్మిచాలనుకుంటున్న ఆయన ఆలోచనల వెనకున్న అంతిమ లక్ష్యం దోపిడీయే'' అన్నారు. 

''ప్రభుత్వ ఖజానాలోని సొమ్ము ప్రజలకు అరకొరగా పంచడం, తిరిగి ఆ సొమ్ముకి రెండింతల సొమ్ము వివిధ రూపాల్లో జగన్ సొంత ఖజానాకు చేరుతోంది. ఈవాస్తవం అందరికీ తెలిసిందే. జగన్ రెడ్డి చేసే ప్రతి ఆలోచన వెనుక ఆయన సొంతలాభం కచ్చితంగా ఉండి తీరుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పరిశ్రములు, కంపెనీలు తీసుకురావడానికి శక్తివంచనలేకుండా ప్రయత్నంచేశారు. తమ పిల్లలకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడకోసం తన మేథస్సుతో కంపెనీలను రాష్ట్రానికి రప్పించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ఒక కంపెనీతో, పరిశ్రమతో మాట్లాడాడా? ఏ ఒక్కరికైనా జీవితాంతం కూడుపెట్టే ఉద్యోగాన్ని ఇవ్వగలిగాడా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మాంసం అమ్మకాల నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.  ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తాను బడుగు, బలహీనవర్గాల కోసం పోరాటంచేస్తాను'' అని బుద్దా వెంకన్న హెచ్చరించారు. 

click me!