బీచ్ లో యువతీ యువకుల ఎంజాయ్... తిరిగి వెళుతుండగా కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 12, 2021, 10:51 AM IST
Highlights

ఆదివారం సెలవు రోజు కావడంతో సూర్యలంక బీచ్ లో సరదాగా గడపడానికి వెళ్లిన విజయవాడ యువతీ యువకులు బాపట్ల వద్ద ఘోర ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. 

గుంటూరు: సూర్యలంక బీచ్ లో సరదాగా గడిపిన కొందరు యువతీ యువకులు బాపట్లక వెళుతూ ఘోర ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కరెంట్ స్తంభానికి ఢీకొట్టి అమాంతం గాల్లోకి ఎగిరి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే  మృతిచెందగా మిగతావారిని స్థానికులు కాపాడారు. 

వివరాల్లోకి వెళితే...  విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదివే ఎనిమిది మంది యువతీయువకులు ఇవాళ(ఆదివారం) సరదాగా గడపడానికి ఓ ఫార్చూనర్ కారులో గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ కు వెళ్లారు. అక్కడ బాగా ఎంజాయ్ చేసిన వారు బాపట్లకు తిరుగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.  

వీరు ప్రయాణిస్తున్న కారు ఆదర్శనగర్ మూలమలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి ఓ కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. అప్పటికే కారు మితిమీరిన వేగంతో వుండటంతో పోల్ విరిగిపోయింది. దీంతో కారు అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపక్కనే వున్న నీటి కాలువలోకి దూసుకెళ్లింది. నీటిలో కారు మొత్తం మునిగిపోయింది. 

వీడియో

ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక మత్స్యకారులు వెంటనే కాలువలోకి దూకి కారులోనుండి యువతీ యువకులను బయటకు తీసారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్ అనే యువకుడు మృతిచెందగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో విజయవాడకు చెందిన ముగ్గురు యువతులు, ఐదుగురు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. 

read more   సాయిధరమ్ తేజ్ బైక్ సెకండ్ హ్యాండ్.. పోలీసుల విచారణలో తేలింది ఇదే!

ఈ ప్రమాదంలో గాయపడిన యువతీ యువకులను స్థానికులు అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అందరూ చికిత్స పొందుతున్నట్లు...ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వెంటనే మృతదేహాన్ని బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నీటమునిగిన కారును బయటకు తీయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు బాపట్ల పోలీసులు తెలిపారు. 
 

click me!