దావోస్‌కని చెప్పి.. లండన్‌కా, ఈ మిస్టరీ వెనుక : జగన్ విదేశీ పర్యటనపై యనమల వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published May 21, 2022, 3:30 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. జగన్ లండన్‌కు వెళ్లడం వెనకున్న మిస్టరీ ఏంటనీ యనమల ప్రశ్నించారు. వ్యక్తిగత పనులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు


వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో (world economic forum) పాల్గొనేందుకు గాను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) దావోస్‌కు (davos) వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే జగన్ దావోస్‌కు కాకుండా లండన్‌కు వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. అధికారులతో కలిసి అధికారిక పర్యటనకు వెళ్లిన జగన్... తన భార్య భారతితో కలిసి లండన్‌లో ల్యాండ్ అయ్యారని కథనాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక విమానంలో జగన్, భారతి, మరో వ్యక్తి మాత్రమే లండన్ కు వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (yanamala ramakrishnudu) సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. 

జగన్ లండన్‌కు వెళ్లడం వెనకున్న మిస్టరీ ఏంటనీ యనమల ప్రశ్నించారు. దావోస్‌కు వెళ్లాలనుకున్నది రాష్ట్రం కోసమా? లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? అని యనమల నిలదీశారు. దోచుకున్న అవినీతి సంపదను దాచుకోవడానికే వెళ్లారా? అని రామకృష్ణుడు ప్రశ్నించారు. ఒకవేళ లండన్‌కు వెళ్లాలనుకుంటే అధికారికంగానే వెళ్లొచ్చని... చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులను వదిలేసి భార్యతో కలిసి లండన్ కు ఎందుకు వెళ్లారని రామకృష్ణుడు ప్రశ్నించారు. వ్యక్తిగత పనులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ దేశానికి వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిందని రామకృష్ణుడు ప్రశ్నించారు.

Latest Videos

Also Read:సీఎం జగన్ విదేశీ పర్యటన షురూ... గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో పయనం

జగన్ గత చరిత్ర దృష్ట్యా ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తడం సహజమేనని ఆయన అన్నారు. కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ సీఎంకైనా గతంలో వచ్చిందా..? ఏపీకి అప్రతిష్ట కాదా..? ఇలాంటి సీఎం టూర్లు గతంలో రాష్ట్ర ప్రజలు చూడలేదంటూ సెటైర్లు వేశారు. దావోస్‌కు అధికార యంత్రాంగానిదో దారి, ముఖ్యమంత్రి దంపతులదో దారా..? అంటూ యనమల విమర్శించారు. 

click me!