టీడీపీ నేత వరుపుల రాజా గుండెపోటుతో మృతి

By narsimha lode  |  First Published Mar 5, 2023, 9:12 AM IST

టీడీపీకి చెందిన ప్రత్తిపాడు  నియోజకవర్గ ఇంచార్జీ  వరుపుల రాజా  గుండెపోటుతో  మృతి చెందాడు. 
 


కాకినాడ: టీడీపీ నేత వరుపుల రాజా  గుండెపోటుతో  శనివారం నాడు  రాత్రి మృతి చెందాడు.  నిన్న రాత్రి  గుండెలో  నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు  రాజా చెప్పడంతో  ఆయనను  కాకినాడలోని  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో  చికిత్స అందిస్తున్న సమయంలోనే  వరుపుల రాజా  మృతి చెందాడు. 

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  సాలూరు,బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు  వరుపుల రాజా  ఇంచార్జీగా  ఉన్నారు. శనివారం నాడు  మధ్యాహ్నం  వరకు  గ్రాడ్యుయేట్స్  ఎన్నికల విషయమై  పార్టీ నేతలతో  రాజా  సమావేశాలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో  అనుసరించాల్సిన  వ్యూహంపై  చర్చించారు.  నిన్న సాయంత్రం  ఆయన   ప్రత్తిపాడుకు  చేరుకున్నారు. ప్రత్తిపాడు లో పార్టీ నాయకులు , కుటుంబ సభ్యులు, బంధువులతో  రాత్రి 9 గంటల వరకు  ఆయన  గడిపారు.  అదే సమయంలో  తనకు గుండెలో  నొప్పిగా  ఉందని  కుటుంబ సభ్యులకు  చెప్పారు. దీంతో  వరుపుల రాజాను కుటుంబ సభ్యులు  కాకినాడలోని ప్రైవేట్  ఆసుపత్రిలో  చేర్పించారు.   ఆసుపత్రిలో  వైద్యులు  చికిత్స నిర్వహిస్తున్న సమయంలో  రాజా మృతి చెందాడు. గతంలో  కూడా రాజాకు  రెండు దఫాలు గుండెపోట్లు వచ్చాయి.  దీంతో  రాజాకు వైద్యులు స్టంట్లు వేశారు.  

Latest Videos

undefined

వరుపుల రాజా  వయస్సు  47 ఏళ్లు. రాజాకు  భార్య, ఇద్దరు పిల్లలున్నారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  రాజా తూర్పు గోదావరి జిల్లా  డీసీసీబీ చైర్మెన్ గా  పనిచేశారు.  అప్కాబ్  వైఎస్ చైర్మెన్ గా  కూడా  పనిచేశారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో  రాజా టీడీపీ అభ్యర్ధిగా  ప్రత్తిపాడు నుండి పోటీ  చేసి ఓటమి పాలయ్యాడు.  ప్రత్తిపాడు  ఎంపీపీగా  రాజా  తన రాజకీయ ప్రస్థానాన్ని  ప్రారంభించారు. 

వరుపుల రాజా  ఆకస్మిక మరణంపై  టీడీపీ చీఫ్ చంద్రబాబు   సంతాపం తెలిపారు.  రాజా అంత్యక్రియలు  ఇవాళ నిర్వహించనున్నారు.  రాజా అంత్యక్రియలకు  చంద్రబాబునాయుడు  హజరుకానున్నారని  తెలుస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఇటీవల కాలంలో  పెద్ద ఎత్తున   గుండెపోట్లతో  మృతి చెందుతున్న ఘటనలు  ఎక్కువగా నమోదౌతున్న  ఘటనలు  చోటు  చేసుకుంటున్నాయి.   గుండెపోట్లు   రాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని  వైద్యులు  సూచిస్తున్నారు. సరైన ఆహరపు అలవాట్లు, వ్యాయమం  వంటి  వాటితో  గుండెపోట్లకు దూరంగా ఉండొచ్చని వైద్యులు  చెబుతున్నారు.  చిన్న వయస్సులోనే  గుండెపోట్లకు వైద్యులు  పలు కారణాలను  చెబుతున్నారు.

click me!