దళిత యువకుడి శిరోముండనం వ్యవహారం...జాతీయ ఎస్సీ కమిషన్ కు వర్ల రామయ్య లేఖ

By Arun Kumar PFirst Published Jul 25, 2020, 10:01 PM IST
Highlights

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. 

విజయవాడ: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన కమిషన్ కు రాసిన లేఖలో 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి దళితులపై దాడులు పెరిగిపోయాయని ప్రస్తావించారు. వైసిపి నాయకులు ఇసుక మాఫియాగా తయారవడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. 

''జులై 18, 2020 న ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీ విజయ్ అనే యువకుడిని ఢీ కొట్టి గాయపరిచింది. ఈ విషయంపై లారీని అడ్డుకున్న వరప్రసాద్ అనే దళిత యువకుడిపై వైసీపీ నాయకుడు అయిన జక్కంపూడి రాజా అనుచరుడు కాలవ కృష్ణమూర్తి దాడి చేయడమే కాకుండా అతనికి సహాయంగా వచ్చిన స్నేహితులు సందీప్, అనిల్, అఖిల్ లపై కూడా దాడి చేయడం జరిగింది. ఇలా అక్రమంగా ఇసుక తరలిస్తూ యువకులపై దాడి చేయడమే కాకుండా సీతానగరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐపీసీ సెక్షన్ 324,354,341,427,506 కింద అక్రమ కేసులు బనాయించారు'' అని తెలియజేశారు. 

read more   కిషోర్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే...ప్రత్యక్ష సాక్షి మాటల్లోనే: నారా లోకేష్ (వీడియో)

''జూలై 20, 2020 సోమవారం నాడు స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో సీతానగరం పోలీసులు యువకులను లాఠీలతో చేతులపై కొడుతూ అమానుషంగా దాడి చేశారు. ఈ క్రమంలోనే వరప్రసాద్ అనే దళిత యువకుడికి గుండు గీయించి అవమానించారు. చివరకు జూలై 21, 2020 మంగళవారం నాడు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో యువకులను విడిచిపెట్టారు. అప్పుడు కూడా గాయాలపాలైన యువకులను హాస్పిటల్లో చేరకూడదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి బెదిరించారు. విషయం తెలుసుకున్న పెందుర్తి ఎమ్మెల్యే వెంకటేష్, మాజీ ఎంపీ హర్షకుమార్ లు వారికి సహాయంగా వెళ్లి హాస్పిటల్ లో చేర్చడం జరిగింది'' అని వివరించారు. 

''ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఒక దళితుడికి గుండు గీయించి అవమానించడం చట్టరీత్యా శిక్షార్హం. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ వారు విచారణ జరిపి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలి'' అని రామయ్య ఫిర్యాదు చేశారు. 

పోలీసులలో ఒక వర్గం వారు అధికార పార్టీకి తొత్తులుగా మారి బాధితులకు న్యాయం చేయడం లేదని రామయ్య లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా అధికార పార్టీ చెప్పిన విధంగా వ్యవహరించని కొంతమంది ప్రభుత్వ అధికారులను వేకెన్సీ రిజర్వులో పెట్టి 50 శాతం జీతాల్లో కోత విధిస్తున్నారని... దీంతో మిగిలిన అధికారులు కూడా బాధితులకు న్యాయం చేయడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. వీటన్నింటిపై జాతీయ ఎస్సీ కమిషన్ సమగ్ర విచారణ జరిపి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి అని రామయ్య  కోరారు. 

click me!