మాచర్లలో విధ్వంసం ... ఏపీలో ఇంత జరుగుతున్నా కేంద్రం పట్టించుకోదా : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By Siva KodatiFirst Published Dec 17, 2022, 2:37 PM IST
Highlights

పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన విధ్వంసాన్ని ఖండించారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కేంద్రం కలగజేసుకోకపోవడం తగదన్నారు. ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఆటవిక పరిస్ధితులను ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నామని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం చోటు చేసుకున్న విధ్వంసంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాచర్లలో వైసీపీ గూండాలు జీపులెక్కి విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అరాచకశక్తులు వచ్చే ప్రమాదం వుందని ముందే తెలిసినా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని.. కార్డెన్ సెర్చ్ నిర్వహించి ఏం సాధించారని చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుండటాన్ని జీర్ణించుకోలేకే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. 

ఉత్తరప్రదేశ్, బీహార్‌ ప్రభుత్వాలు అక్కడి అరాచకశక్తులను అణిచివేసి ప్రశాంత వాతావరణం నెలకొల్పాయని ఆయన గుర్తుచేశారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వమే ఇలాంటి వారిని ప్రోత్సహిస్తోందని సోమిరెడ్డి ఆరోపించారు. ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఆటవిక పరిస్ధితులను ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి కార్యకర్తల మద్ధతు లేకుండా చేయడమే ఈ ఘటన వెనకున్న ఉద్దేశ్యమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కేంద్రం కలగజేసుకోకపోవడం తగదన్నారు. 

ALso REad:మండుతున్న మాచర్ల.. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఉద్రిక్తత..

కాగా... మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్ వరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని పోలీసులు  నిలిపివేశారు.టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు. 

వైసీపీ కార్యకర్తల దాడుల్లో మాచర్ల మంటల్లో చిక్కుకుంది. మూడు గంటలకు పైగా ఈ దాడుల ఘటనలు కొనసాగాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టారు. ఇరువర్గాల కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం బాహాబాహీకి దిగారు. దింతో మొదలైన గొడవలు రాత్రికి పెచ్చుమీరిపోయాయి. రాళ్లు, కర్రలతో ప్రతీకార దాడులుగా మారాయి. 

click me!