నెల్లూరు కోర్టులో చోరీ కేసు... మంత్రి కాకానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి : టీడీపీ నేత సోమిరెడ్డి

By Siva KodatiFirst Published Nov 24, 2022, 4:51 PM IST
Highlights

నెల్లూరు కోర్టులో చోరీ కేసు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కాకాణిని జగన్ వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 
 

మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నకిలీ పత్రాలను తీసుకొచ్చారని ఆరోపించారు. కోర్టు ఆధీనంలో వున్న ఈ తప్పుడు పత్రాలను చోరీ చేశారని, ఇప్పుడు చెబుతున్నవి తప్పుడు పత్రాలని వాటిని కూడా చోరీ చేశారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరాలు చేసిన కాకాణిని జగన్ వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు కోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నానని సోమిరెడ్డి అన్నారు. 

నెల్లూరు కోర్టులో చోరీపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నామన్నారు మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి. చంద్రబాబు లాగా కోర్టులకెళ్లి స్టే తెచ్చుకోలేదని.. నీతిగా వున్నాం కాబట్టే, సీబీఐ విచారణ కోరామన్నారు. దమ్ముంటే చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని.. కాకాని గోవర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. 

ALso REad:నెల్లూరు కోర్టులో చోరీ:సీబీఐ విచారణపై వేసవి సెలవుల తర్వాతే నిర్ణయమన్న హైకోర్టు

కాగా... నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలోని 4వ అదనపు కోర్టులో ఈ ఏడాది ఏప్రిల్ 14న చోరీ జరిగింది. ఈ చోరీలో పలు కేసులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లను దుండగులు ఎత్తుకెళ్లారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై మాజీ మంత్రి సోమిరెడ్డి వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని  ప్రచారం సాగుతుంది. ఈ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురి కావడం కలకలం రేపుతుంది.

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 
 

click me!