మోదీ సమావేశం కోసం ఢిల్లీకి సీఎం జగన్.. అదే మీటింగ్‌కు చంద్రబాబు కూడా.. ఆసక్తికరంగా పరిణామాలు..

By Sumanth KanukulaFirst Published Nov 24, 2022, 3:04 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఇదే సమావేశానికి రావాల్సిందిగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కూడా కేంద్రం నుంచి ఆహ్వానం అందించింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జీ-20 దేశాల సదస్సు జరగనున్న నేపథ్యంలో.. ఆ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యచరణ రూపొందించేందుకు దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపుతుంది.

ఈ క్రమంలోనే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. సీఎం జగన్‌కు ఆహ్వానం పంపారు. దీంతో సీఎం జగన్ డిసెంబర్ 5వ తేదీన సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక, అదే సమావేశానికి ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడుకు కూడా కేంద్రం నుంచి ఆహ్వానం అందించింది. చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే డిసెంబర్ 5న జరగనున్న సమావేశం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. దీంతో చంద్రబాబు కూడా ఆ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన దాదాపుగా ఖరారు అయిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఒకే సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకుముందు ఈ ఏడాది ఆగస్టులో  జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల గురించి చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా కేంద్రం.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపింది. అయితే ఈ సమావేశానికి చంద్రబాబు హాజరుకాగా, జగన్ మాత్రం గైర్హాజరు అయ్యారు. ఆ తర్వాతి రోజున జరిగిన ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు.

అయితే ఇప్పుడు జీ-20 సదస్సు నిర్వహణకు సంబంధించి మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఇతర రాజకీయ పార్టీల నేతలతో పాటు జగన్, చంద్రబాబులు పాల్గొనబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో పాల్గొన పక్షంలో ఇరువురు నేతల మధ్య ఏమైనా పలకరింపులు ఉంటాయా? లేదా? అనేది కూడా చూడాల్సి ఉంది.  ఏది ఏమైనా ఇరువురు నేతలు ఒకే సమావేశంలో పాల్గొంటే.. దానిని అరుదైన ఘటనగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

click me!