వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణకే టిక్కెట్టు రాదా ?

First Published Jan 2, 2018, 1:09 PM IST
Highlights
  • హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణకు ఈసారి చంద్రబాబునాయుడు టిక్కెట్టు ఇవ్వటం లేదా?

హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణకు ఈసారి చంద్రబాబునాయుడు టిక్కెట్టు ఇవ్వటం లేదా? ఏమో, కడప జిల్లా కమలాపురం టిడిపి నేత వీరశివారెడ్డి  అలాగనే చెబుతున్నారు. ఇంతకీ శివారెడ్డి ఏమన్నారంటే వచ్చే ఎన్నికల్లో కమలాపురంలో పోటీ చేయాలనుకునే వారిలో తాను కూడా ఉన్నానంటూ ప్రకటించారు. ఇదే విషయమై తన మద్దతుదారులకు శివారెడ్డి విందు ఇచ్చారులేండి.  ఆ సంరద్భంగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనను గుర్తుచేసారు.

అంత వరకూ బాగానే ఉంది కానీ వచ్చే ఎన్నికల్లో గెలవడని అనుమానం వస్తే తన బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణకు కూడా హిందుపురంలో చంద్రబాబు టిక్కెట్టు ఇవ్వడని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. శివారెడ్డి మాటలతో అందరిలోనూ బాలకృష్ణ గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, హిందుపురంలో టిడిపి ప్రత్యేకించి ఎంఎల్ఏ బాలకృష్ణపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత వచ్చేసింది.

పోయిన ఎన్నికల్లో హిందుపురంలో గెలిచిన దగ్గర నుండి బాలకృష్ణ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాకుండా వ్యవహారాలన్నింటినీ పూర్తిగా అప్పట్లో పిఏ శేఖర్ కు అప్పగించేసారు. దాంతో శేఖర్ రెచ్చిపోవటంతో నేతలందరూ బాలకృష్ణ, చంద్రబాబులపై తిరుగుబాటు లేవదీసిన సంగతి అందరికీ తెలిసిందే. సరే, తర్వాత పిఏని తప్పించినా పార్టీ క్యాడర్లో అయితే వ్యతిరేకత అయితే అలాగే ఉండిపోయింది.

అప్పటి నుండి నియోజకర్గం క్యాడర్లోనే కాకుండా జనాల్లో కూడా ఎంఎల్ఏపై వ్యతిరేకత బాగా కనిపిస్తోంది. దానికితోడు వైసిపి నేతలు కూడా నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అసలు బాలకృష్ణ హిందుపురంలో పోటీ చేయరనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలో ఏకంగా బాలకృష్ణ పేరునే శివారెడ్డి సీన్ లోకి లాగటంతో  టిడిపిలో పెద్ద చర్చే జరుగుతోంది.

 

 

click me!