యాభై రోజులుగా జనాల్లోనే

First Published Jan 2, 2018, 10:58 AM IST
Highlights
  • వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది.

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. గడచిన 50 రోజులుగా జగన్ పాదయాత్ర పేరుతో జనాల్లోనే తిరుగుతున్నారు. సోమవారం నాటికి జగన్ పాదయాత్ర 49 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

ఇక్కడ జరుగుతున్న బహిరంగ సభలకు, సదస్సులకు జనాల నుండి మంచి స్పందన వస్తుండటం వైసీపీ నేతల్లో జోష్ నింపుతోంది. జగన్ ప్రస్తుతం తంబళ్లపల్లి నియోజకవర్గంలో పూర్తయి మదనపల్లిలో సాగుతోంది. సోమవారం మదనపల్లి నియోజకవర్గంలోని చిన్నతిప్ప సముద్రంలో జరిగిన బహిరంగ సభకు అనూహ్యంగా స్పందించారు. సరే, సభలో ప్రసంగించిన జగన్ సహజంగానే ముఖ్యమంత్రి పాలనపై జగన్ విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న అంశాలను వేటినీ అమలు చేయడంలేదని, టీడీపీ వెబ్ సైట్ నుంచి మ్యానిఫేస్టోను తొలగించారని జగన్ ఆరోపించారు.

పేదలను ఆదుకున్నది ఒక్క వైఎస్ మాత్రమేనన్నారు. ముఖ్యంగా బీసీలకు న్యాయం చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డే అని గుర్తుచేసారు. తన తండ్రి ఒక అడుగు వేస్తే పేదల అభివృద్ధి కోసం తాను రెండడుగుల ముందడుగు వేస్తానని జగన్ ప్రకటించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు హామీని నెరవేర్చలేదన్నారు. చేనేత కార్మికుల కోసం బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయిస్తానని చెప్పి ఒక్కరూపాయి కూడా పెట్టలేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని చెప్పారు.

                                                                                                                                                                                                         యాభైవ రోజు షెడ్యూల్

49వ రోజు జగన్ పాదయాత్ర 14.5 కిలోమీటర్ల సాగింది. 50వ రోజు జగన్ సీటీఎం నుంచి ప్రారంభించారు. సీటీఎంలో ప్రారంభయ్యే యాత్ర పులవాండ్లపల్లి, కసిరావుపేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలని, పునుగుపల్లి, విటలాం, టీఎం లోయ, జమ్మిల వారి పల్లి మీదుగా కొనసాగనుంది. సోమవారం జగన్ యాత్రలో విద్యత్తు కాంట్రాక్టు ఉద్యోగులు కలిసి తమ సమస్యలను వివరించారు. పొరుగు రాష్ట్రంలో విద్యుత్తు కాంట్రాక్టుకార్మికుల ఉద్యోగులను క్రమబద్దీకరిస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారంలోకి వస్తే పరిశీలిస్తామని ఈ సమస్యపై జగన్ హామీఇచ్చారు.

click me!