గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ... జగన్ వచ్చినవేళ జనమంతా లబోదిబ..: టిడిపి అధికార ప్రతినిధి ఎద్దేవా

By Arun Kumar PFirst Published Jan 12, 2022, 5:11 PM IST
Highlights

టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వైసిపి పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సంక్రాంతి పండగను జరుపుకునే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని ఆవేదన వ్యక్తం చేసారు.  

అమరావతి: సంక్రాంతి పండుగ (sankranthi festival) తెలుగువారికి చాలా కీలకమైనది... ఇంటిముందు ముగ్గులు, ఇళ్లలో ధాన్యపు రాశులు, వంటిళ్లల్లో పిండివంటలు, ఆడపడుచుల కేరింతలతో హుషారైన వాతావరణంతో బ్రహ్మండంగా జరిగేదని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు (pilli manikyarao) గుర్తుచేసారు. కానీ నేడు వైసిపి (ycp) ప్రభుత్వ పాలనలో ఇవేవీ లేకుండానే సంక్రాంతి జరుపుకునే పరిస్థితి నెలకొందన్నారు.  జగన్ రెడ్డి (ys jagan) ముఖ్యమంత్రి పదవినుండి దిగిపోతేనే తమకు నిజమైన సంక్రాంతి అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని మాణిక్యరావు పేర్కొన్నారు. 

నిన్న(మంగళవారం) తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు ధరలు దిగిరావాలంటే జగన్ దిగిపోవాల్సిందేనంటూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్నారు. వైసిపి ఉన్మాద పాలనను, చేతగాని ముఖ్యమంత్రి వైఫల్యాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని మాణిక్యరావు పేర్కొన్నారు. 

''జగన్మోహన్ రెడ్డి పాదప్రభావంతో రాష్ట్రంలో ప్రజల లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు కరువయ్యాయి. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక కరోనా (corona virus) ప్రభావంతో పండుగలు వెలవెలబోయాయి. రైతులను నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుమందుల ప్రభావం పట్టిపీడిస్తోంది. వాటిని అరికట్టి, రైతులకు న్యాయంచేయాల్సిన అధికార యంత్రాంగం ఏం  చేస్తోందో తెలియని పరిస్థితి. చచ్చీచెడి, ఆరుగాలం శ్రమించి రైతులు పంటలు పండిస్తే వాటిని కొనేనాథుడు లేకుండా పోయాడు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు అరకొరా కొన్నా, రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సంక్రాంతి జరుపుకునే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా మచ్చుకైనా కనిపించడంలేదు'' అని మాణిక్యరావు ఆందోళన వ్యక్తం చేసారు.

''పెద్దలు ఇదివరకు గొడ్డువచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ అని చెప్పుకునేవారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినవేళ నుంచీ ఏపీవాసులకు సంతోషం అనేది దూరమైంది. రెండున్నరేళ్ల ఆయన పాలనలో కరోనా విలయతాండవం చేయడంతో సంక్రాంతితో పాటు, అనేక పండుగలకు ప్రజలు దూరమయ్యారు. ఈ సంక్రాంతి అయినా కాస్త సంతోషంగా జరుపుకుందామంటే రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు ఉపాధి లేకుండా చేశాడు. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలెవరూ చేతిలో చిల్లిగవ్వలేక, పండుగకి కనీసం పాయసంకూడా చేసుకోలేని దుర్భరస్థితిలో ఉన్నారు'' అన్నారు.

''గతంలో చంద్రబాబు నాయుడి గారి హయాంలో నిత్యావసరాలు సామాన్యులకు అందుబాటులో ఉండటంతో ప్రతి ఇల్లు పండగ సందడితో కళకళలాడింది... కానీ ఇప్పుడు జగన్ రెడ్డి పాదం దెబ్బకు ప్రతిఇల్లు వెలవెలబోతోంది. అన్ని పండుగలు జరుపుకుంటూ సంతోషంగా గడుపుతున్నది ఒక్క ముఖ్యమంత్రే. ఈ పాలనలో ప్రజలముఖాల్లో ఎక్కడా చిరునవ్వు కూడా కనిపించడంలేదు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు పెరిగాయి... ప్రజలు బాధపడుతున్నారంటూ గొంతుచించుకున్నాడు. మరిప్పుడు పెరిగిన ధరలతో, టీడీపీ హాయాంలోని ధరలను పోల్చిచూస్తే, అసలు వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. టీడీపీ ప్రభుత్వంలో జేబులో డబ్బులు తీసుకెళితే, సంచినిండా సరుకులువచ్చాయి. ఇప్పుడేమో సంచి నిండా డబ్బులతో వెళితే జేబునిండా కూడా సరుకులు రావడంలేదు'' అని ఎద్దేవా చేసారు. 

''ఆనాడు కందిపప్పు ధర కేజీ 68రూపాయలుంటే, జగన్ పాలనలో 138రూపాయలైంది. అలానే మినపప్పు ధర అప్పుడు కేజీ రూ.69రూపాయలుంటే, ఇప్పుడు రూ.148.  పెసరపప్పు ధర అప్పుడు కేజీ 75రూపాయలుంటే, ఇప్పుడు 150రూపాయలు ఉంది. చింతపండు రూ.141 నుంచి ఒకేసారి ఎకాఎకిన రూ.300కి చేరింది. సన్ ఫ్లవర్ ఆయిల్ కేజీ రూ.88నుంచి రూ.148కి చేరింది. వేరుశనగనూనె 100రూపాయల నుంచి రూ.170 అయ్యింది. వాటితోపాటు పెట్రోల్ డీజిల్ ధరలు, విద్యుత్, ఆర్టీసీఛార్జీలు ఇతరత్రా పన్నుల భారం అమాంతం పెంచారు. ఆఖరికి చంద్రబాబు నాయుడి హయాంలో రూ.149లకే ఇంటర్నె ట్, టీవీ, టెలిఫోన్ కనెక్షన్లు అందిస్తే జగన్ రెడ్డి వచ్చాక దాన్ని రూ.350కి పెంచాడు. పేదలపై ధరలమోత, పన్నులభారమే ఈ ముఖ్యమంత్రి ఈ రెండున్నరేళ్లలో సాధించిన గొప్పప్రగతి'' అని సెటైర్లు విసిరారు. 

''పేదల ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం పేదల రక్తాన్ని పీలుస్తూ కులాసాగా రాజ్య మేలుతోంది అని చెప్పడంలో సందేహమే లేదు. వినియోగదారులకు భారం లేకుండా ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడంలేదు. ముఖ్యమంత్రి గతంలో చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? పండుగకు ఇంటికివచ్చే పిల్లలు, అల్లుళ్లకు కడుపునిండా తిండిపెట్టలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్రప్రజలు ఉన్నారు అనిచెప్పడానికి బాధ పడుతున్నాం. ధరలు దిగిరావాలి-జగన్ దిగిపోవాలని ప్రజలపక్షాన టీడీపీ నినదించినా జగన్ రెడ్డి మనస్సు కరగలేదు. ధరలు తగ్గిస్తే, ప్రజలు పండుగపూట తిండితింటారనే ముఖ్యమంత్రి ఆ దిశగా ఆలోచన చేయలేదు'' అని మాణిక్యరావు మండిపడ్డారు. 

''రాష్ట్రంలో ధరలు తగ్గిస్తామని పెద్దపెద్ద ప్రగల్భాలు పలికిన పెద్దమనిషి కొడాలి నానీకి కరోనా వచ్చింది. కరోనాకే కరోనా రావడంతో ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో ధరలు పెరగకపోయినా, ప్రజలంతా సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే సదుద్దేశంతో ప్రజలకు పండుగ కానుకలు అందించారు. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుకల పంపిణీకి ఏటా రూ.350కోట్లు ఖర్చుపెట్టారు. దోపిడీ, అవినీతి, దుబారాకు అలవాటుపడిన ఈ ముఖ్యమంత్రి మాత్రం సంక్రాంతి కానుక పంపిణీకి రూ.140కోట్లు కూడా ఖర్చుపెట్టలేడా?'' అని నిలదీసారు. 

''ఈ ముఖ్యమంత్రి వచ్చాక ప్రజలెవరూ నెలకుసరిపడా సరుకులు కొనే పరిస్థితిలేకుండా పోయింది. ఆదాయం తగ్గి, ప్రభుత్వదోపిడీ పెరగడంతో ఏ రోజుకి ఆరోజు గడుపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇసుక, మద్యం, ఖనిజసంపద  దోపిడీతో తనపార్టీ వారికి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు దోచిపెడుతున్న జగన్ రెడ్డి, సంక్రాంతి పండుగ కోసం పేదలముఖాల్లో సంతోషం నింపడానికి సంక్రాంతి కానుక పేరుతో రూ.140కోట్లు ఇవ్వలేడా? ప్రజలపై చెత్తపన్ను, మరుగుదొడ్ల పన్ను, నీటిపన్ను, ఆస్తిపన్నులేస్తూ దోచుకుంటున్న వారు, వారికోసం 100కోట్లు ఖర్చుపెట్టలేరా?'' అని పిల్లి మాణిక్యాలరావు నిలదీసారు. 


 

click me!