ఆ చచ్చు సన్నాసులకు ఇదే నా సవాల్... ఆధారాలుంటే బయటపెట్టండి: టిడిపి పట్టాభిరాం సీరియస్

By Arun Kumar PFirst Published Jul 5, 2021, 10:45 AM IST
Highlights

రాజధాని కోసం టిడిపి చేపట్టిన భూసేకరణలో అవినీతి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడంపై టిడిపి నాయకులు పట్టాభిరాం మండిపడ్డారు.

అమరావతి: రాజధాని పేరుతో భూదోపిడీ అని వైసీపీ మళ్లీ ఆవుకథ మొదలుపెట్టిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. రాజధాని కోసం టిడిపి చేపట్టిన భూసేకరణలో అవినీతి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు రెండేళ్లుగా అమరావతిలో దోపిడీకి సంబంధించి ఒక్క ఆధారం అయినా చూపించారా? అని పట్టాభిరాం నిలదీశారు. 

''ఎమ్మెల్యే ఆళ్లను ముందుపెట్టి అమరావతిపై ఇవాళ(సోమవారం) ఉదయం నుంచి మళ్లీ పెద్ద ఎత్తున దుష్ట ప్రచారం ప్రారంభించారు. అయితే చంద్రబాబు దోచుకున్నారంటూ ప్రచారం చేస్తున్న చచ్చు సన్నాసులకు ఇదే నా సవాల్. ఆయన దోచుకున్నట్లు ఆధారాలుంటే బయటపెట్టాలి'' అన్నారు. 

read more  అమరావతి భూముల రగడ.. 4,500 ఎకరాలు కొట్టేసే కుట్ర, బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేయాలి: ఆర్కే

''అమరావతి భూసేకరణలో అక్రమాలు జరిగినట్లు ఇప్పటివరకు ఒక్క ఆధారమైనా బయటపెట్టగలిగారా? అసైన్డ్ భూములు ఇతరుల పేరుపై ట్రాన్స్‌ఫర్ కావు. రైతులే రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారు. 63,410 రిటర్నబుల్ ప్లాట్లు దళితులకు ఇవ్వడం జరిగింది. ఒక్క ప్లాట్ అయినా బినామీ పేరుపై ఉన్నట్లు రుజువు చేయగలరా?'' అని ప్రశ్నించారు. 

''ప్రభుత్వ రికార్డులన్నీ మీ దగ్గర పెట్టుకుని ఆధారాలు బయటపెట్టలేకపోతున్నారు. ప్రజల దృష్టిని మరల్చాలనే కొత్త కథ తెరమీదకు తెచ్చారు. ఏదో ఒక విధంగా బురద చల్లాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దళితులకు మెరుగైన పరిహారం ఇవ్వడం మీకు ఇష్టం లేదా? అసైన్డ్ భూములను కబ్జా చేసిన చరిత్ర మీది. దళితుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదు'' అని టిడిపి నాయకులు పట్టాభిరాం మండిపడ్డారు. 
 

click me!