ఆన్లైన్లో అమ్మకానికి రూ.12కోట్ల తిమింగలం వాంతి... ముఠా అరెస్ట్

By Arun Kumar PFirst Published Jul 5, 2021, 9:31 AM IST
Highlights

అక్రమంగా అంబర్ గ్రీస్(తిమింగలం వాంతి) అమ్మకానికి ప్రయత్నిస్తున్న ముఠా సభ్యుల కదలికలపై నిఘా పెట్టిన చెన్నై వన్య ప్రాణుల నేర నియంత్రణ విభాగం గుంటూరు జిల్లాలో వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 
 

గుంటూరు: అత్యంత విలువైన తిమింగలం వాంతి(అంబర్ గ్రీస్) ను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టి అడ్డంగా బుక్కయ్యింది ఓ ముఠా. అక్రమంగా అంబర్ గ్రీస్ అమ్మకానికి ప్రయత్నిస్తున్న ముఠా సభ్యుల కదలికలపై నిఘా పెట్టిన చెన్నై వన్య ప్రాణుల నేర నియంత్రణ విభాగం గుంటూరు జిల్లాలో వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

ఆన్ లైన్ లో అంబర్ గ్రీస్ అమ్మకానికి పెట్టిన ముఠా వివరాలను సేకరించిన అధికారులు వ్యాపారుల పేరిట సంప్రదించారు. తాము అంబర్ గ్రీస్ కొంటామని సదరు ముఠా సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే నరసరావుపేటలోని పువ్వాడ హాస్పిటల్ వద్ద ముఠా సభ్యులను కలిసిన అటవీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

read more  తిమింగలం వాంతి, సులేమాన్ స్టోన్ అంటూ మోసాలు: పోలీసులకి చిక్కిన కేటుగాళ్లు

నిందితుల నుండి 8కిలోల అంబర్ గ్రీస్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.12కోట్లు వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన ఎనిమిదిమందిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. 

సౌందర్య క్రీమ్స్, పర్ప్యూమ్స్ లో వాడే అంబర్ గ్రీస్(తిమింగలం వాంతి) బంగారం కంటే విలువైనది. సువాసన అధిక రోజులు ఉండడానికి ఈ అంబర్ గ్రీస్ ను పెర్ఫ్యూమ్స్ లో ఉపయోగిస్తారు. అయితే అరుదుగా లభించే దీని కోసం వ్యాపారులు కోట్లు కుమ్మరిస్తుంటారు. అందువల్లే విదేశాలకు దీన్ని అక్రమంగా తరలించే ముఠాలు దేశంలో ఎక్కువయ్యాయి. 

click me!