ప్రతిపక్షనేతగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నో హామీలు.. అన్ని రికార్డెడ్‌గా వున్నాయి: నారా లోకేష్

By Siva KodatiFirst Published Aug 22, 2022, 9:07 PM IST
Highlights

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రతిపక్షనేతగా వున్నప్పుడు జగన్ హామీ ఇచ్చారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన మాటలన్నీ ఇప్పుడు రికార్డెడ్‌గా వున్నాయన్నారు. 

వైసీపీ ప్రభుత్వం, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ . సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని, వారిని వెంటనే క్రమబద్దీకరించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో జగన్ నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. ఆనాడు ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో ఆయనది మొసలి కన్నీరేనా అంటూ లోకేష్ దుయ్యబట్టారు. విద్యార్హత, అనుభవం, సర్వీసుని పరిగణనలోకి తీసుకుంటామని, దళారీ వ్యవస్థను రద్దు చేస్తామని జగన్ హామీలు ఇచ్చారని... ఇవన్నీ రికార్డెడ్‌గా వున్నాయని నారా లోకేష్ స్పష్టం చేశారు. దశాబ్ధాల కాలంగా ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో 26 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో 24 వేల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేశారని నారా లోకేష్ తెలిపారు. 

అంతకుముందు నెల్లూరు జిల్లా కావలిలో దళితుడు దుగ్గిరాల కరుణాకర్ మృతిపై డిజిపికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కరుణాకర్ ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దుర్భరమైన స్థితిలో ఉన్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన వర్గాలు, దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని.. కావలిలో కరుణాకర్ ఆత్మహత్య రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు. 

ALso Read:నెల్లూరులో దళితుడి ఆత్మహత్య.. ఆ వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి : డీజీపీకి చంద్రబాబు లేఖ

కరుణాకర్ ముసునూరులోని రెండు చేపల చెరువులను సబ్ లీజుకు తీసుకుని భారీగా పెట్టుబడి పెట్టాడని.. అయితే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సురేష్‌రెడ్డి చెరువుల్లో చేపలు పట్టకుండా అడ్డంకులు సృష్టించి వేధించారని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి నేతల వేధింపులకు తాళలేక కరుణాకర్‌ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ అధినేత పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శ్రీశైలం దేవస్థానం బోర్డులో పదవిలో కూడా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. దళితులపై దాడుల ఘటనల్లో ఈ మూడేళ్లలో కఠిన చర్యలు లేకపోవడం వల్లనే నిందితులు బరితెగిస్తున్నారని ప్రతిపక్షనేత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సరైన, తక్షణ చర్యల ద్వారా మాత్రమే దళితులకు రక్షణ దొరుకుతుందని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. 
 

click me!