ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
అమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసింది సిఐడి. గత 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంటున్న చంద్రబాబుపై ఒకటి తర్వాత ఒకటి కేసులు పెడుతూనే వున్నారు. తాజాగా గత టిడిపి హయాంలో కొన్ని మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో చంద్రబాబుపై సిఐడి మరో కేసు నమోదు చేసింది. ఇలా తన తండ్రిని జైల్లోంచి బయటకు రానివ్వకుండా కుట్రలు పన్నుతున్న వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుకు మానవ రూపమని లోకేష్ మండిపడ్డారు. ఇప్పటికే పిచ్చికి లండన్ మందులు వాడుతున్నట్టే... కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిదంటూ ఎద్దేవా చేసారు. కక్ష సాధింపులో నువ్వు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ బ్రదర్! అంటూ సీఎంపై లోకేష్ సెటైర్లు వేసారు.
''జగన్ తెచ్చిన పిచ్చి మందుకి 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారు. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యపాన నిషేధం పేరుతో లక్షకోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ చంద్రబాబు గారి పై కేసు పెట్టడం వింతగా ఉంది. ఆరోగ్యం పాడైన ప్రతి ఒక్కరూ జగన్ మీద కేసు పెడితే 35 లక్షలు కేసులు పెట్టొచ్చు'' అని లోకేష్ పేర్కొన్నారు.
Read More చంద్రబాబుకు షాక్: మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులంటూ అభియోగాలు, కేసు
''జగన్ నీకో చిన్న జే బ్రాండ్ ఛాలెంజ్.. రాష్ట్రంలో నువ్వు పెట్టిన ఏ లిక్కర్ షాపు ముందైనా నేను చర్చకు రెడీ... ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతుందో తేల్చుకుందాం సిద్ధమా? నిన్ను మందు బాబులు తిడుతున్న తిట్లు వినే ధైర్యం ఉంటే టైం అండ్ డేట్ ఫిక్స్ చెయ్యి'' అంటూ నారా లోకేష్ ఛాలెంజ్ చేసారు.
ఏమిటీ లిక్కర్ కేసు :
గత టిడిపి ప్రభుత్వం కొందరికి లబ్ది చేకూర్చేందుకు మద్యం పాలసీలో మార్పులు చేసారంటూ వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవ వర్మ సిఐడికి ఫిర్యాదు చేసారు. దీంతో ఆనాటి సీఎం చంద్రబాబుతో పాటు సంబంధిత మంత్రి కొల్లు రవీంద్ర, మరికొందరిపై సిఐడి కేసులు నమోదు చేసింది. ఇందులో పిసి యాక్ట్ 1988 తో పాటు C.No.5134/EOW/C- 12/CID-AP/2023, Dt.28.10.2023 a case in Crime No. 18/2023 U/S 166, 167, 409, 120(B) R/w 34 IPC & Sec.13(1)(d) R/w Sec. 13(2) కింద కేసు నమోదు చేసారు. ఇందులో A1 నరేష్, A2గా కొల్లు రవీంద్ర,
A3గా చంద్రబాబును చేర్చారు సిఐడి అధికారులు.
లిక్కర్ పాలసీ వ్యవహారంలో జరిగిన అవకతవకలకు సంబంధించి చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసినట్లు ఎసిబి కోర్టుకు సిఐడి అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా జరపాలంటూ పిటిషన్ దాఖలు చేసారు సిఐడి అధికారులు. ఈ పిటిషన్ ను ఎసిబి కోర్టు విచారణకు అనుమతించింది.