టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా.. మూడుసార్లు ఓడితే నో టికెట్ : మహానాడులో నారా లోకేష్

By Siva KodatiFirst Published May 27, 2022, 5:37 PM IST
Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈసారి తాను తప్పుకుంటానని చెప్పారు నారా లోకేష్. ఇకపై ఎవరికైనా రెండుసార్లే పదవులు దక్కుతాయని.. వరుసగా మూడుసార్లు ఓడితే టికెట్ ఇచ్చేది లేదని నారా లోకేష్ స్పష్టం చేశారు. 

మహానాడులో (mahanadu) టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడు సార్లు ఓడితే టికెట్ ఇచ్చేది లేదని.. అలాగే  ఇకపై ఎవరికైనా రెండు సార్లే పదవులు దక్కుతాయి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సారి పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శిగా తానూ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏళ్ల తరబడి పదవుల్లో వుంటే కొత్త రక్తం ఎలా వస్తుందని లోకేష్ ప్రశ్నించారు. 30 నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికీ యాక్టీవ్‌గా లేరని.. పనిచేయని నేతలకు ఇన్‌ఛార్జ్ పదవులు వుండవని ఆయన హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు దండం పెడితే గెలిచే పరిస్థితి వుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వస్తే మంత్రులు పార్టీకి రిపోర్టు చేసే వ్యవస్థ తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. 

అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. సంక్షేమం లేదని, అంతా మోసకారి సంక్షేమమేనంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని... అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 30 లక్షల ఇళ్లని చెప్పిన మీరు కట్టింది మూడే ఇళ్లని.. అడిగితే కేసులు పెడుతున్నారని, మీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవని చంద్రబాబు స్పష్టం చేశారు. వర్షాకాలంలో రోడ్లపై చేపలు పట్టేలా నీళ్లు ఉంటున్నాయని సెటైర్లు వేశారు. 

ALso Read:కోడికత్తితో డ్రామాలు.. గొడ్డలిపోటును గుండెపోటన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం కోనసీమలో రాజకీయం : చంద్రబాబు

గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారని... ఒక్క ఛాన్స్‌ అంటే ప్రజలు నమ్మారని ప్రతిపక్షనేత గుర్తుచేశారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడని... సమస్యను పక్కదారి పట్టించేందుకు కోనసీమ అల్లర్లు తీసుకొచ్చారని చంద్రబాబు ఆరోపించారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మంత్రిని కాపాడిన పోలీసులు ఇల్లు తగలబడకుండా ఎందుకు ఆపలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 

మీరే దాడిచేసుకొని మీరే రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సీట్లలో మూడింటినీ మరో రాష్ట్రం వాళ్లకు ఇచ్చారని.. సహ నిందితులకు సీట్లు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు.  25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని.. పోలవరం ఏమైంది, విభజన హామీల అమలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. గెలిచిన తర్వాత కేంద్రం వద్ద మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని... జగన్‌ దిగిపోతే తప్ప మంచి రోజులు రావని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్‌ అండ్‌ కంపెనీ ఆదాయం పెరిగిందని... క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ నినాదం ప్రతి ఇంట్లో వినిపించాలని ప్రతిపక్షనేత పిలుపునిచ్చారు.
 

click me!