నీ అక్రమాస్తుల్లో ఒక్క శాతం అమ్మినా... ఏపీ అప్పులన్నీ తీరతాయి: జగన్ పై లోకేష్ సంచలనం

By Arun Kumar PFirst Published Aug 2, 2021, 10:30 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ లక్షల కోట్ల అక్రమాస్తులు కూడగట్టుకున్నారని... వాటిలోంచి కేవలం 1శాతం అమ్మినా ఏపీ అప్పులన్నీ తీరతాయని లోకేష్ అన్నారు. 

అమరావతి: ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటివద్దే ఫించన్ అందిస్తామన్న సీఎం జగన్ మాటలు ప్రగల్భాలేనని తేలిపోయిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రతి నెలా ఏదో ఒక సాకు చెప్పి ఫించన్లు ఇవ్వడంలేదని... అయితే జగన్ మనసుపెడితే ఒకటోతేదీనే అందరికీ ఇవ్వడం సాధ్యమని లోకేష్ అన్నారు.  

''అవ్వాతాత‌ల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు వైఎస్ జగన్ గారూ! పెన్ష‌న్ మూడువేలకు పెంచుకుంటూ పోతామ‌ని... రూ.250 పెంచి ఆగిపోయారు. ఒక‌టో తారీఖునే త‌లుపులు ఇర‌గ్గొట్టి మ‌రీ పెన్ష‌న్ గ‌డ‌ప‌కే ఇస్తామ‌న్న ప్ర‌గ‌ల్భాలు ఏమ‌య్యాయి? ఈ రోజు 1వ తేదీ... అయినా 5 ల‌క్ష‌ల మందికి పైగా పింఛ‌న్లు అంద‌లేదు'' అంటూ వైసిపి ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు లోకేష్. 

read more  కొండపల్లిలో అక్రమాలు జరగకుంటే.. దేవినేని పర్యటనపై అభ్యంతరమెందుకు: ప్రత్తిపాటి పుల్లారావు

''ప్ర‌తీనెలా టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మేనా? అప్పు దొర‌క‌డంలేదా? మీకు ఇవ్వాల‌నే మ‌న‌సుండాలే కానీ, మీ ద‌గ్గ‌రే ల‌క్ష‌ల కోట్లు మూలుగుతున్నాయి. వాళ్ల‌నీ, వీళ్ల‌నీ అప్పులు అడ‌గ‌డం ఏమీ బాలేదు. ఒక్క నెల జే ట్యాక్స్‌లో 10 శాతం వెచ్చిస్తే అంద‌రికీ పింఛ‌న్లు ఇచ్చేయొచ్చు'' అన్నారు. 
 
''క్విడ్‌ప్రోకో ద్వారా కూడ‌గ‌ట్టిన‌ అక్ర‌మాస్తులలో 1 శాతం అమ్మితే ఏపీ అప్పుల‌న్నీ తీరిపోతాయి. పింఛ‌న్లు లేటు చేస్తే, పెంపు గురించి అడ‌గ‌ర‌నే లాజిక్‌తో  పింఛ‌న్ ఇచ్చే ఒక‌టో తేదీని అలా అలా పెంచుకుంటూ పోతున్నారా జ‌గ‌న్ రెడ్డి గారు!'' అంటూ వరుస ట్వీట్లతో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు లోకేష్. 

ఆగస్ట్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా  వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చేపట్టారు వాలంటీర్లు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇలా ప్రతిచోటా ఇంటింటికి వెళ్లి మరీ పెన్షనర్లకు సొమ్మును అందచేశారు. ఇలా ఆదివారం తెల్లవారుజాము నుండి రాత్రి 8 గంటల వరకు 80.39 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మొత్తం 60.50 లక్షల మంది పెన్షనర్లకు గానూ 48.63 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1157.74 కోట్ల సొమ్ము పెన్షనర్లకు అందచినట్లు తెలిపారు.   
 

click me!