వైసీపీలో చేరాలని నాపై ఒత్తిడి: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

Published : Apr 29, 2019, 01:14 PM IST
వైసీపీలో చేరాలని నాపై ఒత్తిడి: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

సారాంశం

ఐదేళ్లుగా  తనకు  వైసీపీలో చేరాలని  ఒత్తిడి ఉందని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. కానీ, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని భావించి టీడీపీలో చేరినట్టుగా ఆయన స్పష్టం చేశారు. మరోసారి ఏపీలో రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.  

హైదరాబాద్: ఐదేళ్లుగా  తనకు  వైసీపీలో చేరాలని  ఒత్తిడి ఉందని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. కానీ, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని భావించి టీడీపీలో చేరినట్టుగా ఆయన స్పష్టం చేశారు. మరోసారి ఏపీలో రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

సోమవారం నాడు జేసీ దివాకర్ రెడ్డి  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జగన్ తన స్నేహితుడి కొడుకు... వ్యక్తిగతం కంటే సమాజమే తనకు ముఖ్యమని తాను భావించినట్టు ఆయన తెలిపారు. తాను సంకుచితంగా ఆలోచించకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను టీడీపీలో  చేరినట్టుగా ఆయన వివరించారు.

తమ సామాజిక వర్గానికి చెందిన వారంతా మెజార్టీ  ప్రజలు జగన్‌కు మద్దతు ఇచ్చారని ఆయన వివరించారు. తన లాంటి వాళ్లు  ఒక్క శాతం జగన్‌కు వ్యతిరేకంగా నిలబడ్డారని ఆయన చెప్పారు. తనకు దండిగా కులాభిమానం ఉందని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.  రాష్ట్రంలో కులాభిమానం పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు వల్ల రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. జగన్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన తెలిపారు.

ఏపీలో వైసీపీ గెలుస్తోందని  ఆ పార్టీ  నేతలు చెప్పడంపై ఆయన ప్రస్తావిస్తూ ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయన్నారు. ఏపీలో పసుపు-కుంకుమ స్కీమ్ టీడీపీకి కలిసి వచ్చిందన్నారు.ఈ పథకం 15 రోజులు ముందు కానీ, ఆ తర్వాత కానీ ప్రజలకు అందితే తమకు కొంత నష్టం జరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అనంతపురం జిల్లాలో మంచి అభ్యర్థులు ఎవరో  చెడ్డవాళ్లు ఎవరనే విషయాన్ని పరిశీలించి ఓట్లు వేయాలని తాను ప్రజలను కోరినట్టుగా ఆయన వివరించారు. అనంతపురం నుండి తన కొడుకు పవన్ కుమార్ రెడ్డి, తాడిపత్రిలో తన సోదరుడి కొడుకు అస్మిత్ రెడ్డిలు విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని  జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీని కోసం తాను నడుం కట్టనున్నట్టు చెప్పారు. సమాజంలోని ప్రముఖులతో కలిసి ఓ కార్యక్రమాన్ని తీసుకొంటున్నట్టుగా  ఆయన వివరించారు. మే మొదటి వారంలో  హైద్రాబాద్ వేదికగా సమావేశాన్ని నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు.

ఎన్నికల్లో విచ్చల విడి ధన ప్రవాహన్ని అడ్డుకొనేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టీఎన్ శేషన్ ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న కాలంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ఆయన ప్రస్తావించారు.

PREV
click me!

Recommended Stories

నగరి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో CM Chandrababu Power Full Speech | Asianet News Telugu
అమెరికాఅనుభవాలతో సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని ఆశిస్తున్నా: Chandrababu | Asianet News Telugu