నవరత్నాలకు రంధ్రాలు, జై జగన్ కాదు.. గో బ్యాక్ జగన్ అంటున్నారు : టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Siva Kodati |  
Published : May 07, 2022, 07:13 PM IST
నవరత్నాలకు రంధ్రాలు, జై జగన్ కాదు.. గో బ్యాక్ జగన్ అంటున్నారు : టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి

సారాంశం

ఏపీలో వైఎస్ జగన్ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జై జగన్ కాదు.. గో బ్యాక్ జగన్ అని ప్రజలే అంటున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలని జనమే కోరుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.   

ఏపీ సర్కారుపై టీడీపీ (tdp) సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి (gorantla butchaiah chowdary) తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో జగన్ పాకుడు మెట్ల మీద ఉన్నారని.. ప్రతిరోజూ ఆయన కొద్ది కొద్దిగా దిగజారిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జై జగన్ కాదు.. గో బ్యాక్ జగన్ అని ప్రజలే నినాదాలిస్తున్నారని గోరంట్ల వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు టూర్ మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగిందని.. ఏపీ ప్రభుత్వం ఛార్జీలతో విపరీతంగా బాదేస్తుందని ప్రజలే చెబుతున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఓ చేత్తో డబ్బులు ఇచ్చి.. మరో చేత్తో రెండింతలు జగన్ ప్రభుత్వం (ys jagan govt) లాక్కుంటోందని ఆయన మండిపడ్డారు. జగన్ హయాంలో ఐదు లక్షలు పెన్షన్లు, 12 లక్షలు రేషన్ కార్డులు రద్దయ్యాయని వెల్లడించారు.

ఏపీలో నవరత్నాలకు రంధ్రాలు పడ్డాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. అమ్మఒడి కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సారా బుడ్డికే పోతున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో అందరికీ ఫీజు రీయింబర్సుమెంట్ అందించే వాళ్లమని.. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పేరుతో నిబంధనలు పెట్టారని గోరంట్ల విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును (chandrababu naidu) గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలతో ప్రజలు విసిగిపోయారని ఆయన మండిపడ్డారు. 

ఆస్పత్రుల్లో వసతుల కోసం వైసీపీ నేతలు చందాలు అడుగుతున్నారని.. ఫ్యాన్లు కావాలన్నా.. సీలింగ్ వేయాలన్నా చందాలు తీసుకురావాలని సూచిస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయని.. అంబులెన్స్ మాఫియాకు అధికార పార్టీ అండదండలున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు కూడా లేని దుస్థితి నెలకొందన్నారు. డబ్ల్యూహెచ్‌వో చెప్పిన దాని ప్రకారం ఏపీ ప్రభుత్వం కూడా భారీ ఎత్తున కరోనా మరణాలను దాచేసిందని బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వల్ల మరణించిన బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహరం కూడా ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. అనుమతులే రాని వైద్య కళాశాలలను కట్టేశానని సీఎం జగన్ స్వయంగా బోగస్ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. 

జగన్ ఓ బోగస్ సీఎం అని.. వైసీపీది ఓ ఫ్రాడ్ ప్రభుత్వమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని ఆస్పత్రుల్లో మందులను సరఫరా చేయాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లోని కాంట్రాక్టర్లకు సంబంధించి సుమారు రూ. లక్ష కోట్లు పెండింగులో ఉన్నాయని.. ఆరోగ్యశ్రీకి చెద పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేస్తే.. వాటికి సీఎం జగన్ రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చివరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా లేకుండా చేశారని బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?