స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం యత్నాలు ఇలా.. మీరేమో అలా: సోము వీర్రాజుకు గంటా కౌంటర్

By Siva KodatiFirst Published Feb 19, 2021, 6:52 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాష్ట్ర నాయకత్వం వ్యాఖ్యలు సరికాదన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు పరిరక్షణ చారిత్రక అవసరమని ఆయన అభివర్ణించారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాష్ట్ర నాయకత్వం వ్యాఖ్యలు సరికాదన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు పరిరక్షణ చారిత్రక అవసరమని ఆయన అభివర్ణించారు. ప్రయత్నాలు మొదలయ్యాయని నేరుగా కేంద్రం ప్రకటిస్తోందని గంటా గుర్తుచేశారు.

స్టీల్ ప్లాంట్ కోసం ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని.. ఏపీ బీజేపీ నాయకత్వం ఢిల్లీ పెద్దలను ఒప్పించాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడాలని.. గంటా సూచించారు. 

అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ప్రైవేటీకరణ అని చంద్రబాబు, కమ్యూనిస్టులే అంటున్నారని వీర్రాజు చెప్పారు.

బీజేపీని వ్యతిరేకించాలనే స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దాడులకు పాల్పడుతోందని.. ఎన్నికల ముందు సంక్షేమ పథకాల పేరుతో రూ.35 వేల కోట్లు విడుదల చేసిందని వీర్రాజు వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు. 

కొద్దిరోజుల ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన...  స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ ఉక్కుమంత్రిని ఏపీ బీజేపీ నేతలు కలిశారు.

ప్రజల సెంటిమెంట్‌ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల విలీనం తరహాలోనే స్టీల్‌ప్లాంట్‌ విలీనం ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీల ఆందోళనలను వివరించామని సోము వీర్రాజు పేర్కొన్నారు. 
 

click me!