
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత థూళిపాళ్ల నరేంద్ర కుమార్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై మిథున్ రెడ్డి సవాల్‌ను లోకేష్ ఎప్పుడో స్వీకరించారని అన్నారు. నిన్నటి వరకు స్పందించిన మిథున్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని సవాల్‌కు పిలిచారని నరేంద్ర కుమార్ అన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి లోకేష్‌ను జిల్లా నుంనచి బయటకు పంపారని ఆయన దుయ్యబట్టారు. ఇంట్లో దాక్కుని ఇప్పుడు చర్చకు రమ్మని పిలవడం వారి పిరికితనానికి నిదర్శనమన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా వేమూరులో పాదయాత్రలో వున్న సమయంలోనూ ఎన్నికల కోడ్ అమల్లో వుందని.. కానీ ఆయన వేమూరు పరిధిలోనే వున్నారని ధూళిపాళ్ల గుర్తుచేశారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తోందని నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లాలో అభివృద్ధి లేదని.. అంతా అవినీతేనని నారా లోకేష్ పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. యాత్రలో పాల్గొనకుండా జనాన్ని భయభ్రాంతులకు గురిచేసినప్పటికీ..ప్రజలు లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారని థూళిపాళ్ల అన్నారు. లోకేష్ తిరిగి చిత్తూరు జిల్లాకు వచ్చాక చర్చకు సిద్ధమని నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.
అంతకుముందు నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాల్ విసిరిన లోకేష్ పలాయనం చిత్తగించారంటూ దుయ్యబట్టారు. ఎంపీ మిథున్ రెడ్డి తంబళ్లపల్లెలోనే వున్నారని.. అభివృద్ధిపై తాము ఎప్పుడు సిద్ధంగా వున్నామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చి.. లోకేష్‌తో మాట్లాడిస్తున్నారని రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. గ్రాడ్యుయేట్ , టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.
ఇకపోతే.. ఇటీవల లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఈ నెల 12న తంబళ్లపల్లెలో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ప్లేస్, టైమ్ చెప్పాలని మిథున్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా డీఎన్ఏ నీ బ్లడ్‌లో వుంటే తనతో పోటీ చేయాలంటూ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదని.. ఎవరో రాసిచ్చింది చదవకూడదన్నారు.