టీడీపీ మంచిగా వుంటూనే.. నేను మెత్తని మనిషిని కాదు , మొహమాటాల్లేవ్ : పొత్తులపై మారిన పవన్ స్వరం

Siva Kodati |  
Published : Mar 12, 2023, 05:22 PM ISTUpdated : Mar 12, 2023, 05:25 PM IST
టీడీపీ మంచిగా వుంటూనే.. నేను మెత్తని మనిషిని కాదు , మొహమాటాల్లేవ్ : పొత్తులపై మారిన పవన్ స్వరం

సారాంశం

పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మంచిగా వుంటూనే 20 సీట్లే ఇస్తామన్నట్లుగా ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. త్యాగాలు చేయాలి.. దానికి తాను కంకణం కట్టుకున్నానని పవన్ స్పష్టం చేశారు.

కాపుల దగ్గర అంత ఆర్ధిక బలం లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. కాపుల్లో సంఖ్యా బలం వున్నా ఐక్యత లేదన్నారు. సమాజంలో కులాలను విడదీసే మనుషులు ఎక్కువని పవన్ పేర్కొన్నారు. ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని.. సంఖ్యాబలం ఉంటే అధికారం పంచుకోకతప్పదని అర్ధం కావాలంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక కులం పక్షాన మాట్లాడనని.. అధికారం ఒకరి సొత్తు కాదని ఆయన వ్యాఖ్యానించారు. సరిగ్గా సినిమాలు చేస్తే రోజుకు రూ.2 కోట్లు సంపాదించే సత్తా తనకు వుందని పవన్ స్పష్టం చేశారు. 

కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదని ఆయన తేల్చిచెప్పారు. తాను మెత్తటి మనిషిని కాదని.. రాయలసీమలో బలిజలు గొంతెత్తాలంటే భయపడతారని పవన్ వ్యాఖ్యానించారు. కాపులు ఎదగడమంటే మిగతా కులాలు తగ్గడం కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేను ఓడిపోతే తొడలు కొట్టింది కాపులేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులు సంఘాలుగా విడిపోయి వున్నారని పవన్ తెలిపారు. ప్రజల్లో మార్పు రానంత వరకు రాజకీయ సాధికారత మర్చిపోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తానెప్పుడూ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోనని పవన్ తేల్చిచెప్పారు. నిర్మోహమాటంగా కాపుల ఆత్మగౌరవాన్ని తాను తగ్గించనని ఆయన పేర్కొన్నారు. 

ALso REad: పవన్ ‌ను సీఎం చేయక తప్పదు: చంద్రబాబుకు హరిరామజోగయ్య సలహా

కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఏ పార్టీ ఎజెండాల కోసం తాను పనిచేయడం లేదన్నారు. ఒకరేమో రూ.1000 కోట్లతో తాను డీల్ కుదుర్చుకున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అధికారంలో వున్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు గౌరవం ఇచ్చి తీరాలని పవన్ పేర్కొన్నారు. గొడవ పెట్టుకుంటే ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడతారనే భయం ఉంటుందని ఆయన అన్నారు. తాను ఓటమిని భయపడే వ్యక్తిని కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పెట్టి పదేళ్లు గడిచిపోయిందని.. ప్రస్తుతం తాను ప్రతికూల వాతావరణంలోనే పార్టీని నడుపుతున్నానని పవన్ తెలిపారు. కాపులంతా తనకు ఓట్లు వేసుంటే భీమవరం, గాజువాకలలో ఓడిపోకూడదు కదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ తనకు లక్షలాది అభిమానులు వున్నారని.. రెడ్లలోనూ తనకు అభిమానులు వున్నారని.. కానీ ఓటు మాత్రం వారి కులానికే వేసకున్నారని పవన్ చెప్పారు. 

వాస్తవికతను దృష్టిలో పెట్టుకునే తాను మాట్లాడతానని.. అవమానపడుతూ ఎక్కడైనా తాను ఎందుకు వుంటానని ఆయన పేర్కొన్నారు. జనసేనను నమ్ముకున్న వారి ఆత్మగౌరవాన్ని తగ్గించమని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రూ.1000 కోట్లతో రాజకీయాలను నడపొచ్చంటే అంతకంటే హాస్యాస్పదం వుండదన్నారు. డబ్బుంటే పార్టీలను నడపలేమని పవన్ తేల్చిచెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాపుల ఎజెండాను మార్చకూడదని ఆయన హితవు పలికారు. కాపులు పెద్దన్న పాత్ర వహిస్తే ఈ వ్యక్తి సీఎంగా వుండరని పవన్ అన్నారు. ఎట్టిపరిస్ధితుల్లో వైసీపీకి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. సంకల్పం లేకుంటే రూ.10 వేల కోట్లు వున్నా పార్టీని నడపలేమన్నారు. 

నువ్వెంత ఎదిగినా తన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలనే ధోరణి సీఎం జగన్‌దని పవన్ ఎద్దేవా చేశారు. తాను ఓడిపోతే మీసాలు మెలేసి తొడలు కొట్టొంది కాపులేనన్నారు. తాను ఓడిపోతే మీకేంటీ ఆనందం అని ఆయన ప్రశ్నించారు. వాళ్లు మంచిగా వుండాలి.. మనలో మనం కొట్టుకోవాలి ఇదే వాళ్ల వ్యూహమని పవన్ వ్యాఖ్యానించారు. సంఖ్యా బలం ఎక్కువ వున్న కులాల్లో ఐక్యత వుండదని చాలా మంది వున్నారని.. అధికారం చూడని ఏ కులం కూడా ఈ మాట పడకూడదన్నారు. త్యాగాలు చేయాలి.. దానికి తాను కంకణం కట్టుకున్నానని పవన్ స్పష్టం చేశారు. కాపులు పార్టీని నడపలేరన్న విమర్శలకు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకుడు చనిపోయినప్పుడు జిల్లాకు ఆయన పేరు పెట్టమనడం కాదన్నారు. ఆయన బతికి వున్నప్పుడు వెంట నడవాలని పవన్ పేర్కొన్నారు. తాను విరాళాలు ఇవ్వాలని ఎవ్వరిని ఆడగలేదని.. తన సొంత డబ్బుతో పార్టీని నడుపుతున్నానని పవన్ చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu