ఆ చెక్ కోసం ఏం సంతకాలు చేశారు: జగన్‌పై దేవినేని విమర్శలు

By Siva KodatiFirst Published Oct 24, 2020, 7:58 PM IST
Highlights

కేసుల మాఫీ కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు లేదన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం కోసం మేం ఖర్చు పెట్టిన రూ.,1,850 కోట్ల చెక్ తీసుకురావటానికి ఏం సంతకాలు పెట్టారని ఆయన ప్రశ్నించారు

కేసుల మాఫీ కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు లేదన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం కోసం మేం ఖర్చు పెట్టిన రూ.,1,850 కోట్ల చెక్ తీసుకురావటానికి ఏం సంతకాలు పెట్టారని ఆయన ప్రశ్నించారు.

పోలవరాన్ని ముంచేందుకే 22 ఎంపీ సీట్లు గెలిచారా అని దేవినేని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండి పోలవరంపై వైసీపీ రాసిన చెత్తరాతల వల్ల రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన విమర్శించారు.

పదవీ వ్యామోహంతో ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారో అంతటినీ నిన్న కేంద్రం నిలదీసిందని ఉమా ఆరోపించారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌పై శనివారం ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం ముగిసింది. ప్రాజెక్ట్ నిధులకు సంబంధించి తాజా పరిణామాలపై మంత్రులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం.

కేంద్రం 2014 అంచనాలకే ఆమోదం తెలిపితే.. పరిస్థితి ఏంటన్నదానిపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీకి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సమావేశం తర్వాత మంత్రులెవరూ స్పందించలేదు. అయితే సవరించిన డీపీఆర్‌ను ఆమోదించాలని ఏపీ ప్రభుత్వం.. కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. అయితే పాత అంచనాలనే ఆమోదిస్తామని కేంద్రం తేల్చిచెబుతోంది.

పోలవరం అంచనా వ్యయం రూ.20,389.61 కోట్లేనని కేంద్ర ఆర్ధిక శాఖ చెబుతోంది. 2013-14లో అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లని, 2018లో తుది అంచనా వ్యయం రూ.57,297 కోట్లుగా తేల్చారు.

ఈ క్రమంలో రూ.47,725 కోట్లుకు కేంద్ర జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రూ.20,389 కోట్ల వ్యయ ఆమోదానికి కేంద్ర ఆర్ధిక శాఖ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు పోలవరం ప్రస్తుత పరిస్ధితికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని మంత్రులు ఆరోపిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

కమీషన్ల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు మేమే నిర్మించుకుంటామని చెప్పారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోకుండదా ఉంటే కేంద్రం ఎన్ని నిధులైనా ఇచ్చేదని కన్నబాబు చెప్పారు.

ఇటు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను షరతుల్లేకుండా వెంటనే చెల్లించాలని కోరారు.

త్వరితగతిన రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని బుగ్గన విజ్ఞప్తి చేశారు. టీడీపీ వల్లే కేంద్రం పాత అంచనాలకు మొగ్గుచూపుతోందన్నారు బుగ్గన. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు.

click me!