
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందువల్లే దారిపొడవునా పరదాలు కట్టుకుని... వేల మంది పోలీసులను అడ్డం పెట్టుకుని మరీ ప్రజా రాజధాని ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారని అన్నారు. తాడేపల్లి కొంప నుండి వెంకటాయపాలెం కేవలం ఆరు కిలోమీటర్ల దూరమే...అయినప్పటికి సీఎం జగన్ హెలీకాఫ్టర్ లో వెళ్లాడంటే ఆయన భయం ఏ స్థాయిలో వుందో అర్థమవుతుందని అన్నారు. అందుకే వైఎస్ జగన్ ను పులివెందుల పులి కాదు తాడేపల్లి పిల్లి అని అంటున్నామని మాజీ మంత్రి ఎద్దేవా చేసారు.
ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో హైదరాబాద్ నుంచి అమరావతికి ‘రాజధాని టు రాజధాని’ పేరిట అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతున్న ఈ పాదయాత్రకు మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతు పలికారు. కొలికపూడిని కలిసి కొంతదూరం పాదయాత్ర చేపట్టారు మాజీ మంత్రి.
వీడియో
ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ... రాజధాని అమరావతి నిర్మాణం కోసం వేల ఎకరాలు భూములిచ్చిన రైతు కుటుంబాలు రోడ్డెకి పోరాటం చేస్తున్నాయని అన్నారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు, దళిత సోదరులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేసారు... ఇలాంటి ఓ సైకో చేతిలో రాష్ట్రం విలవిల్లాడిపోతోందని ఉమ మండిపడ్డారు.
ఇక వైఎస్ వివేకా హత్యపైనా ఉమ సంచలన వ్యాఖ్యలు చేసారు. బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న జగన్ రెడ్డి కుటుంబసభ్యుల్లో భయాందోళన మొదలయ్యిందని అన్నారు. సిబిఐ చార్జిషీట్ కొంతమేరకు బయటకు రావడంతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైందని దేవినేని ఉమ అన్నారు.