
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఏపీ మంత్రి జోగి రమేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ పిచ్చి కుక్క అని.. చంద్రబాబు ముసలి నక్క అంటూ తీవ్ర పదజాలంతో కామెంట్ చేశారు. సీఎం జగన్ ఈరోజు సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభ వేదికపై నుంచి మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పెత్తందార్ల కోటలను బద్దలు కొట్టారని అన్నారు.
అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే.. కోర్టుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పేదల పక్షాన పోరాటం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు గాలికొదిలేస్తే ఆయన కొడుకు లోకేష్ ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతున్నాడని.. అతడికి జగన్‌తో పోటీపడే స్థాయి లేదని అన్నారు.
‘‘కుక్కలు చిత్తకార్తెలో రోడ్ల మీదకు వచ్చి మొరుగుతాయి. వీళ్లంతా చిత్తకార్తె కుక్కులు వీళ్లందరూ. మా ఎస్సీల కోసం, మా ఎస్టీల కోసం, మా బీఎసీల కోసం, మా మైనారిటీలు కోసం, మా నిరూపేదల కోసం జగనన్న పోరాడుతుంటే.. ముసలినక్క చంద్రబాబు నాయుడు మొరుగుతున్నాడు. నక్కలు శవాలను కూడా పీక్కుతింటాయి. చంద్రబాబు అలాగే పేదలను పీక్కుతిన్నాడు. పవన్ కల్యాణ్ ఒక పిచ్చి కుక్క. పవన్ కల్యాణ్ పెళ్లాలను మార్చడం కాదు.. పార్టీలను కూడా మార్చాడు. మార్చడం, తార్చడం అనేది పవన్ కల్యాణ్‌కు వెన్నతో పెట్టిన విద్య’’ అని జోగి రమేష్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్, డిల్లీలో ఉన్న విగ్గు రాజుతో కలిసి ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలి, ఏ పార్టీతో కలిసి పోటీ చేయించాలనే కంపెనీ పెట్టుకోవచ్చని విమర్శించారు. ఈ సమయంలో వేదికగా సీఎం జగన్ చిన్నగా నవ్వుతూ కనిపించారు. అయితే జోగి రమేష్ ప్రసంగం మధ్యలో మాత్రం సీఎం జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టుగా కనిపించింది.