అచ్చెన్నాయుడికి అనారోగ్యం... జగనే బాధ్యత వహించాలి: దేవినేని ఉమ ఆగ్రహం

By Arun Kumar PFirst Published Jun 12, 2020, 11:18 AM IST
Highlights

మాజీ మంత్రి, శాససభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడును ఎసిబి పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రులు దేవినేని ఉమ, జవహర్ లు స్పందిస్తూ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 

విజయవాడ: మాజీ మంత్రి, శాససభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడును ఎసిబి పోలీసులు అరెస్ట్ చేసిన చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది అరెస్ట్ కాదని... జగన్ ప్రభుత్వం చేయించిన కిడ్నాప్ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. 

''శాసనసభలో ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న మా డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు గారిని అనారోగ్యంతో ఉన్నా తప్పుడు కేసులతో వందలాది మంది పోలీసులు కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాలి. ఇది బీసీవర్గాలపై దాడి. రాజకీయ కక్ష సాధింపు కాదా?'' అంటూ ముఖ్యమంత్రి జగన్ ను ఉమ నిలదీశారు. 

అచ్చెన్నాయుడు అరెస్ట్‌ దుర్మార్గమని మాజీ మంత్రి జవహర్ కూడా మండిపడ్డారు.ఈ అరెస్ట్ పై ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండడానికే అచ్చెన్నను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేశారన్నారు. ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని జవహర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

read more   ఈఎస్ఐ వ్యవహారం కాదు... అచ్చెన్నాయుడు అరెస్టుకు కారణమదే: నారా లోకేష్

 శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలంలోని సొంత గ్రామం నిమ్మాడలో టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కుంభకోణం జరగడం... ఈ స్కాంతో ఆయనకు సంబంధాలున్నట్లు తేలడంతో ఏసిబి పోలీసులుఅరెస్ట్ చేసినట్లు సమాచారం. 

భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. అచ్చెన్నాయుడు సిఫార్సుల కారణంగానే అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) ఉప నేతగా ఆయన ఉన్నారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడి అరెస్టు జరిగిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 

అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.988 కోట్ల  మెడికల్ సామాగ్రి కొనుగోళ్లు జరిగాయని, ఇందులో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు గుర్తించారు. అచ్చెన్నాయుడు సిఫార్సు మేరకు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.  

మరో మాజీ మంత్రి పాత్ర కూడా ఈసీఐ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.  అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మొత్తం 40 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మందులు, పరికరాలు,ల్యాబ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. నకిలీ కొటేషన్లతో వ్యవహారం నడిపినట్లు తేలింది. కొనుగోళ్ల టెండరింగులో అచ్చెన్నాయుడి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.  

click me!