వివేకా హత్య కేసు .. నాలుగేళ్లు ముద్దాయిని జగన్ కాపాడారు : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై దేవినేని ఉమా

Siva Kodati |  
Published : Apr 16, 2023, 05:01 PM IST
వివేకా హత్య కేసు .. నాలుగేళ్లు ముద్దాయిని జగన్ కాపాడారు : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై దేవినేని ఉమా

సారాంశం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడంపై స్పందించారు మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా. వివేకా కేసులో జగన్ నాలుగేళ్లు ముద్దాయిని కాపాడారని ఉమా ఆరోపించారు.   

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడంపై స్పందించారు మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో బాధ్యత వహిస్తూ జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం ఇక నడవదని.. ఆయన పని అయిపోయిందని దేవినేని జోస్యం చెప్పారు.

వివేకా కేసులో జగన్ నాలుగేళ్లు ముద్దాయిని కాపాడారని ఉమా ఆరోపించారు. ఈ కేసులో ముద్దాయిల అరెస్ట్‌పై జగన్ నోరు తెరవాలని డిమాండ్ చేశారు. జగన్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని స్పందించాలని ఉమా డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో సగం వాటా తమదేనని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నా.. జగన్ సర్కార్ మూసుకుని కూర్చొందని దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోదావరిపై చింతలపూడి ప్రాజెక్ట్ గురించి జగన్ మాట్లాడకపోవడం ఏంటని దేవినేని ప్రశ్నించారు. 

ALso Read : వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం... వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్

కాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదివారం సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే వివేకా హత్య కేసు విచారణను వేగవంతం చేసిన సిబిఐ అరెస్టులను ప్రారంభించడం అవినాష్, భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లా పులివెందులోని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇళ్లకు సిబిఐ అధికారులు చేరుకోవడంతో అలజడి మొదలయ్యింది. అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతుండగా తాజాగా సిబిఐ అధికారులు అవినాష్ ఇంటికి చేరుకోవడంతో ఏదో జరగబోతోందని అందరూ భావించారు. చివరకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

కుటుంబంతో వ్యక్తిగతంగానే కాదు రాజకీయంగా విబేధాల నేపథ్యంలో సొంత బాబాయ్ వివేక్ ను అవినాష్ రెడ్డి హత్య చేయించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సానుభూతి కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా వివేకా హత్యకు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా అధికార పార్టీకి చెందిన కీలక నాయకుల ప్రమేయం వున్నట్లు అనుమానాల నేపథ్యంలో వివేకా కూతురు సిబిఐ విచారణను కోరారు. దీంతో ఏపీ పోలీసుల చేతినుండి ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లడంతో ఏపీలో అలజడి మొదలయ్యింది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం